Sep 01,2023 23:27

ప్రజాశక్తి - విజయవాడ, కలెక్టరేట్‌ : పేద రైతులకు అండగా నిలబడి పెట్టుబడి సాయం అందించేందుకు వైయస్సార్‌ రైతు భరోసా ప్రభుత్వం అమలు చేస్తోందని ఎన్‌టిఆర్‌, కృష్ణాజిల్లా కలెక్టర్లు ఎస్‌.డిల్లీరావు, పి.రాజాబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఇన్‌పుట్‌ సబ్బిడీ రైతుల ఖాతాలలో జమ చేసే కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. విజయవాడ నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, వివిధ కార్ఫోరేషన్‌ చైర్మన్‌లు, అధికారులతో వీక్షించిన అనంతరం జిల్లాకు చెందిన రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా, పెట్టుబడి రాయతీ చెక్కులను అందజేశారు. మచిలీపట్నం కలెక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్‌ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎన్‌టిఆర్‌ జిల్లాలో వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఐదో ఏడాది మొదటి విడతలో 9,929 మంది రైతులకు రూ.7 కోట్ల 44 లక్షల 67 వేల 500 ఆర్థిక సాయం అందజేశారు. జూలై, ఆగస్టుల్లో కురిసిన అధిక వర్షాలలో పంట నష్టపోయిన 65 మంది రైతులకు రూ 3 లక్షల 32 వేల 550 పెట్టుబడి రాయితీ ఖాతాలలో జమ చేశారు. కృష్ణాజిల్లాలో 5వ ఏడాది మొదటి విడతగా 7,462 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న 139 మంది కౌలు రైతులు మొత్తం 7,601 మంది రైతులకు 7,500 చొప్పున పెట్టుబడి సాయంగా మొత్తం రూ.5.70 కోట్లు, ఈ ఏడాది ఖరీఫ్లో మే నుండి ఆగస్టు వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఉద్యాన పంటలు దెబ్బతిన్న 211 మంది రైతులకు రూ.21.61 లక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2019 అక్టోబర్‌ 15 నుండి ఈ పథకం అమలు చేస్తోందన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అవుతూ శ్రీ శైలజారెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు టి. శ్రీకాంత్‌, మనోజ్‌కోఠారి, జమలపూర్ణమ్మ, గీతాంజలిదేవి, లిడ్‌ క్యాప్‌ డైరెక్టర్‌ ఝన్సీరాణి, మహిళా ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ విజితా సంపత్‌, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌ నాగమణెమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె. బాలాజీ కుమార్‌, జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులు యం.రత్నశ్రీ, యం. సప్న, యు. ఊర్మిళ, ఏవివి అనిత భాను పాల్గొన్నారు. అలాగే మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్‌ జన్ను రాఘవరావు, కమిటీ సభ్యులు శ్రీకాకుళపు నాగేశ్వరరావు, బందరు నియోజకవర్గ వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ చూడామణి రావు, వ్యవసాయాధికారులు మనోహరరావు, మణిధర్‌, ఉద్యాన శాఖ అధికారి చందు పాల్గొన్నారు.