- సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ : పట్టణంలో బషీర్‌ఖాన్ పెట్రోల్ బంకులో క్లీన్ చేస్తుండగా ముగ్గురు కార్మికులు చనిపోయిన దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఎఒకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం బషీర్‌ఖాన్ పెట్రోలు బంకు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు కార్మికులు మతి చెందిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సష్టించినా స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి స్పందించక పోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన నాయకుల పెట్రోలు పంపు కాబట్టే కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికులు మతి చెందిన సంఘటనలో బషీర్‌ఖాన్ పెట్రోలు పంపు యాజమాన్యం నిర్లక్ష్యం అడుగడుగునా కనపడుతున్నా హత్య కేసు నమోదు చేయకుండా ఐపిసి 174 పెట్టి కేసు నమోదు చేయడం అంటే నిందితులను కాపాడే ప్రయత్నం చేయడమే అని అన్నారు. అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారుల అనుమతి లేకుండా, ఆక్సిజన్, నిచ్చెన, తాడు లేకుండా నైపుణ్యం లేని కార్మికులను 15 అడుగుల లోతులో ఉన్న ట్యాంక్‌లో ఎలా దింపుతారని ప్రశ్నించారు. ఇంత దుర్ఘటన జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో జరిగితే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రమాదానికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, వారి కుటుంబాలకు ఎల్‌జి పాలిమార్స్ ఘటనలో ఇచ్చినట్లు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకుని దుర్ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్రంగా విచారణ జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బషీర్‌ఖాన్ పెట్రోలు పంపు దుర్ఘటనపై మానవహక్కుల సంఘానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తదితరులకు లేఖ రాయడంతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులను సమీకరించి ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రామాంజులు పాల్గొన్నారు.










