పెట్రోల్ ట్యాంకర్లో దిగి ఊపిరి ఆడక ముగ్గురు కార్మికులు మృతి ఒకర్ని రక్షించబోయి మరొకరు మృతువాత
రాయచోటిటౌన్ :అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పట్టణంలో ఉన్న బషిర్‌ఖాన్ పెట్రల్ బంక్‌లోని ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా వైఎస్‌ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నెకు చెందిన ఇద్దరు, పెండ్లిమర్రికి చెందిన ఒకరు మృతిచెందారు. అర్బన్ సిఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హెచ్‌పి పెట్రోల్ బంక్‌లో నిరుపయోగంగా ఉన్న పెట్రోల్ ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు సంబంధిత కంపెనీకి చెందిన కార్మికులు శివ (20), రవి (32), ఆనంద్ (40) గుంతలో దిగారు. వీరిలో మొదట రవి అనే వ్యక్తి ట్యాంకర్ గుంతలో దిగాడు. శుభ్రం చేస్తున్న తరుణంలో మరింత కిందకు జారిపడ్డాడు. అతన్ని కాపాడడం కోసం మరో వ్యక్తి ఆనంద్ దిగాడు. అతనూ కిందకు జారిపోవడంతో వీరిద్దరిని కాపాడేందుకు శివ అనే వ్యక్తి అందులో దిగాడు. ముగ్గురు ఊపిరి ఆడక ముగ్గురు మృతిచెందారు. వెంటనే రెస్క్యూ టీమ్ సాయంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. 108 సాయంతో మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.










