Apr 23,2022 07:18
  • రేట్లు ఏ రోజుకారోజే
  • కరోనా అనీ చూడకుండా ఎడాపెడా పన్నులు

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ డీజిల్‌, పెట్రోలు ధరల బాదుడుకు హద్దే ఉండటం లేదు. కరోనా మహమ్మారి విలయంతో ప్రజల బతుకులు అతలాకుతలమవుతుండగా సరిగ్గా సమయం చూసుకొని డీజిల్‌, పెట్రోలు ఛార్జీలు పెంచేసి ఖజానా నింపుకుంటోంది. సమస్త ధరలూ పెరిగి జనం దిక్కులేని వారయ్యారు. గడచిన ఇరవై ఏళ్లల్లో పెరిగిన ఛార్జీలలో మోడీ పాలనలోనే 40 శాతం పెరిగాయి. కోవిడ్‌ సమయంలో రెండేళ్లల్లోనే 35 శాతం పెరిగాయి. ఢిల్లీలో వాజపేయి సర్కారు ఉన్న 2003 ఏప్రిల్‌లో లీటరు పెట్రోలు రూ.33.49 ఇప్పుడు 105.41. గతేడాది నవంబర్‌లో అత్యధికంగా రూ.110 పలికింది. లీటరు డీజిల్‌ 2003లో రూ.22.12 కాగా ఇప్పుడు 96.67. 2020 జూన్‌లో పెట్రోలు కంటే డీజిల్‌ ధర ఎక్కువ కావడం ఆల్‌టైం రికార్డ్‌. అప్పుడు పెట్రోలు రూ.79.76 కాగా డీజిల్‌ 79.88. బిజెపి ప్రతిపక్షంలో ఉండగా 'పెట్రో' ధరల పెరుగుదలకు కాంగ్రెస్‌ కారణమని దుయ్యబట్టింది. తానొచ్చాక కాంగ్రెస్‌ ఒరవడిని ఎప్పుడో దాటేసింది. 2014లో మోడీ వచ్చే నాటికి లీటరు పెట్రోలు రూ.72.26, డీజిల్‌ 55.48. ఈ అంకెలే బిజెపి జమానాలో ఛార్జీల పెరుగుదల ఏ విధంగా ఉందో తెలియజేస్తాయి.

  • ట్యాక్స్‌ లే.. ట్యాక్స్‌లు...

ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా మోడీ సర్కారు ఇష్టానుసారం పన్నులు, సర్‌ఛార్జీలు, సెస్‌లు వేసింది. లీటరు పెట్రోలు బేసిక్‌ ప్రైస్‌ రూ.53.34 కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులన్ని ంటితో కలుపు కొని ఢిల్లీలో రిటైల్‌ ప్రైస్‌ రూ.105.41. వీటిలో రూ.52.07 కేవలం పన్నులే. బేసిక్‌ ప్రైస్‌లో పన్నులు దాదాపు 48 శాతం. లీటరు డీజిల్‌ బేసిక్‌ ప్రైస్‌ రూ.54.87 కాగా అన్ని ట్యాక్స్‌లూ కలుపుకొని రిటైల్‌లో రూ.96.67. పన్నులు రూ.41.80 (41 శాతం). పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం బాదే పన్నులు బేసిక్‌ ఎక్సయిజ్‌ డ్యూటీ, స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సయిజ్‌ డ్యూటీ, రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌, అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌, కస్టమ్స్‌ డ్యూటీ. ఇవి కాకుండా రాష్ట్రాలు వేసే వ్యాట్‌, సెస్‌లు అదనం. అంతర్జాతీయ ధరలను బట్టి ఛార్జీలు పెరుగుతాయనే సర్కారు వాదన శుద్ధ అబద్ధం. 2014-2018 మధ్య ముడి చమురు ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. కానీ మోడీ ప్రభుత్వం ఆ కాలంలోనే లీటర్‌ పెట్రోలుపై రూ.13, డీజిల్‌పై రూ.11 ఎక్సయిజ్‌ సుకం వేసింది. అనంతరం రూ.4 తగ్గించింది. మళ్లీ 2020 మేలో పెట్రోలుపై 11, డీజిల్‌పై 10 ఎక్సయిజ్‌ పన్ను వేసింది. సెస్‌లు, సర్‌ ఛార్జీలూ బాదింది.

  • రాష్ట్రాలకు అన్యాయం

పన్నులు, సెస్‌లతో పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం వసూలు చేసిన పన్నులు విపరీతంగా పెరిగాయి. 2019-20లో రూ.2.38 లక్షల కోట్లు వసూలు చేయగా, 2020-21లో వసూళ్లు రూ.3.84 లక్షల కోట్లకు చేరాయి. ముందటేడు వసూళ్లలో వృద్ధి రేటు 4 శాతం కాగా నిరుడు ఏకంగా 67 శాతం. సెస్‌లు, సర్‌ఛార్జీల వసూళ్లలో రాష్ట్రాలకు వాటా ఇవ్వకపోవడంతో ఈ కాలంలో రాష్ట్రాలకు కేంద్రం పంచిన పన్నులు తగ్గాయి. పన్నుల్లో వాటా 41 శాతం పంచాలని 15వ ఆర్థిక సంఘం చెప్పగా కేంద్రం 6 శాతం లోపే ఇచ్చింది. తన పన్నులు తగ్గించే బదులు రాష్ట్రాలు తమ పన్నులు తగ్గించుకోవాలంటోంది. కోవిడ్‌ వేళ ఆదాయం తగ్గినా కేరళ సహా కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించి తమ ప్రజలకు ఉపశమనం కల్పించాయి. కేంద్రం ఎన్నికలొచ్చినప్పుడు ధరలు పెంచకుండా, ఉలేదంటే అరకొరగా తగ్గించమో చేస్తోంది. లేకపోతే దంచుడే.

  • ఇక్కడే ఎక్కువ

అత్యధిక పన్నులు ఎపిలోనే ఉన్నాయి. పెట్రోల్‌పై వ్యాట్‌ 31 శాతం, డీజిల్‌పై వ్యాట్‌ 22.25 శాతం. ఇవి కాకుండా లీటర్‌పై రూ.4 సెస్‌, రూపాయి రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. అత్యధిక పన్నులున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఎపి ఉంటోంది. అందుకే మన రాష్ట్రంలో డీజిల్‌, పెట్రోలు ధరలు ఎక్కువ. కేంద్రం పన్నులు పెంచడంతో ఆదాయం పెంచుకుంటున్న ఎపి ప్రభుత్వం, సెస్‌లు, సర్‌ఛార్జీలలో కేంద్రం వాటా ఇవ్వకపోయినా పెద్దగా మాట్లాడట్లేదు. ఇదే సమయంలో పలు రాష్ట్రాలు తమ పన్నులు తగ్గించుకోగా ఎపి అందుకు సిద్ధ పడలేదు. దేశంలో ఇంతకుముందు పెట్రోలు, డీజిల్‌ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది. నయా-ఉదారవాద విధానాల్లో భాగంగా యుపిఎ-2 ప్రభుత్వం పెట్రోలు ధరలపై నియంత్రణ ఎత్తేయగా, ఎన్‌డిఎ సర్కారు డీజిల్‌ రేట్లపై నియంత్రణ ఎత్తేసింది. రోజువారీ ధరల నిర్ణయంతో ఏ రోజుకారోజే అన్నట్లుంది. ధరలపై ప్రభుత్వ నియంత్రణ, పన్నుల తగ్గింపు, ప్రైవేట్‌ రిఫయినరీలపై సర్కారు పట్టు, దేశీయంగా చమురు ఉత్పత్తి పంపు ఇవే ప్రత్యామ్నాయాలు. జిఎస్‌టి పరిధిలోకి తేవడం అనేది పాక్షిక ఉపశమనమే. నయా-ఉదారవాద విధానాలు ఈ ప్రత్యామ్నాయాలను ఎంతమాత్రం సహించవు.

- కెఎస్‌వి ప్రసాద్‌