Apr 06,2022 06:57

గుజరాత్‌లో బిజెపి పెద్ద ఎత్తున అణచివేత చర్యలకు పాల్పడుతోందని సిపిఎం 23 వ మహాసభలకు ప్రతినిధులుగా వచ్చిన ఆ రాష్ట్ర బృందం తెలిపింది. మీడియా ప్రతినిధులతో బృంద సభ్యులు మంగళవారం మాట్లాడారు.బృందంలోని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు అరుణ్‌మెహతా మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి బిజెపి ప్రభుత్వం ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదన్నారు. ఎక్కడికక్కడ నిర్బంధ చర్యలకు దిగుతోందన్నారు. కాంగ్రెస్‌ నుండి గెలిచిన 24 మంది ఎంఎల్‌ఏలు మూడేళ్లలో బిజెపిలో చేరారని, దీంతో కాంగ్రెస్‌కు ఓటు వేసిన బిజెపికే చేరుతుందని ప్రజలు భావిస్తున్నారని వివరించారు. అదేసమయంలో ఇతర ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదని, దీంతో ప్రజానీకంలో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోందని తెలిపారు. జంతు సంరక్షణ చర్యల పేరిట వివిధ రకాల మాంసాహారాన్ని నిషేధించడం,చివరకు గుడ్ల వ్యాపారాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు బిజెపి ప్రభుత్వం పాల్పడిందన్నారు. మైనార్టీలను లక్ష్యంగాచేసుకుని ప్రజలను పెద్దఎత్తున విభజిస్తోందన్నారు.వేరుశనగతో పాటు పత్తిరైతుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాజ్‌కోట్‌, సబర్‌ఘాట్‌,ఆర్వల్లి ప్రాంతాల్లో సిపిఎం రైతాంగ ఉద్యమాలను నిర్మించి పోరాడుతోందని తెలిపారు. ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను మరింతగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించడం వంటి కార్యాచరణతో తాము పనిచేస్తున్నామని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.