Feb 06,2022 10:36

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాల్లో గతేడాది కన్నా ఆదాయం స్వల్పంగా పెరిగింది. తాజాగా ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు జరిగిన ఆదాయ, వ్యయాల వివరాలను కాగ్‌ ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది మొత్తం ఆదాయం 2,14,276 కోట్లు వస్తుందని అంచనా వేయగా, మూడు త్రైమాసికాలకు కలిపి డిసెంబర్‌ వరకు 1,56,029 కోట్లు వచ్చింది. ఇది గతేడాదికన్నా 2.3 శాతం ఎక్కువగా ఉంది. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కిస్తే 1,77,196 కోట్లు అంచనా వేయగా, డిసెంబర్‌ వరకు 55 శాతంతో 97887 కోట్లు వచ్చింది. ఇది గతేడాది కన్నా ఏడు శాతం అధికం. ఇక రాష్ట్ర సొంత పన్నులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే డిసెంబర్‌ వరకు 69,943 కోట్లు వచ్చింది. ఇది గతేడాదికన్నా ఏకంగా 10.14 శాతం ఎక్కువ. అదే సమయంలో ఖర్చు కూడా పెరుగుతోంది. బడ్జెట్‌లో 2,13,394 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేయగా, డిసెంబర్‌ వరకు 1,55,376 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది గత ఏడాది కన్నా రెండు శాతం అధికంగా ఉన్నట్లు తేలింది.
     ఈ వ్యయంలో సాధారణ రంగం, ఎకనామిక్‌ రంగాల్లో గత ఏడాది కన్నా తక్కువ వ్యయం కనిపించింది. సాంఘిక రంగంలో మాత్రం 9 శాతం అధికంగా ఖర్చు చేశారు. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 50,525 కోట్లు రుణంగా తీసుకున్నారు. దీంతో మొత్తం రుణం ఇప్పటివరకు 2,98,722 కోట్లకు చేరుకున్నట్లు తేలింది. అలాగే తీసుకున్న రుణాలపై డిసెంబర్‌ వరకు చెల్లించిన వడ్డీ 15,291 కోట్లుగా తేలింది. లోటు పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 37 వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉంటుందని పేర్కొనగా తొమ్మిది నెలలకే ఈ లోటు ఏకంగా 58,112 కోట్లకు చేరిపోయింది. గత ఏడాది 142 శాతం అధికంగా ద్రవ్యలోటు నమోదుకాగా, ఈ ఏడాది 157 శాతానికి పెరిగింది. రెవెన్యూ లోటు కూడా అదే స్థాయిలో పరుగులు తీస్తోంది. బడ్జెట్‌లో ఐదు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేయగా మూడు త్రైమాసికాల్లోనే ఇది 46 వేల కోట్లకు చేరిపోయింది. ఇది 918 శాతం కావడం గమనార్హం. ఇంత భారీ స్థాయిలో లోటు పెరుగుతుండటం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.