Jan 07,2023 19:28

మాట్లాడుతున్న ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి- రాయచోటి : పెండింగ్‌ డిఎలను వెంటనే చెల్లించి ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వాలని అన్నమయ్య జిల్లా ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేని ఆవేదన వ్యక్తం చేశారు. దాచుకున్న పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ సొమ్ము నుంచి కుటుంబ అవసరాల కోసం రుణం రూపంలో తీసుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. సిపిఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకొస్తానని ఓట్లు వేయించుకొని, నేడు జిపిఎస్‌ పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు మోసం చేయడానికి చర్యలకు ఉపక్రమించడం అన్యాయమని తెలిపారు. నెలపొడవునా పనిచేసిన కాలానికి ఒకటవ తేదీనే జీతాలు కూడా చెల్లించకపోవడం ఒక ఎత్తు అయితే జీతాల కన్నా సంక్షేమ పథకాలే ముఖ్యమని పాలకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఓవైపు దేశంలోనే అభివద్ధిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని చెబుతూనే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డిఎలు, డిఎల బకాయిలు సరైన సమయంలో వేతనాలు చెల్లించకపోవడం దారుణమని చెప్పారు. ఏవైనా సమస్యల పట్ల గళం విప్పితే అక్రమ కేసులు, అరెస్టులు, బైండోవర్లు ఉపాధ్యాయులపై ప్రయోగించడం ఏ విధంగా ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమో వారే చెప్పాలని కోరారు. ఇకనైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి చిత్తశుద్ధితో వాటి పరిష్కారానికి చొరవ చూపాలని, లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో నాయకులు జాబిర్‌, సుబ్రమణ్యం రాజు, జగన్‌ మోహన్‌ రెడ్డి, గోపాల్‌ నాయక్‌, రాజా రమేష్‌, శివా రెడ్డి, సురేంద్రారెడ్డి, రామచంద్ర, గఫార్‌ ఖాన్‌, ముజాహిద్‌, సబాతుర్‌, హరి బాబు, నాదిర్‌షా, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.