పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి
ప్రజాశక్తి-కావలి : విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు సూచనలతో ఉదయగిరి రోడ్డులోని ఎలక్ట్రికల్ డివిజనల్, ఇంజనీర్ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో పాల్గొన్న కావలి పట్టణ, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, సైకో పోవాలి! సైకిల్ రావాలి! అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.17 వేల కోట్ల భారం మోపారని, పేద, మధ్యతరగతి ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల బాదుడు దారుణమని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటులో భారీస్కాం జరుగుతోందని వివరించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో చార్జీలు పెంచలేదని, ఇళ్లు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు అమ్మడం ద్వారా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. జగన్‌రెడ్డి హయాంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. రైతులు పండించే పంటపొలాల మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఎందుకు ఉరి బిగిస్తున్నారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలన అంతం దిశగా పయనిస్తుందని, దానికి మొన్నటి రోజున జరిగిన ఎంఎల్‌సి ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. మోసపూరిత జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ కిషోర్‌బాబు, బొట్లగుంట శ్రీహరి నాయుడు, జ్యోతి బాబురావు, పోతుగంటి శ్రీకాంత్, ద్రోణదుల వాసంతి, కాకి ప్రసాదరావు, గొట్టిపాటి రాము, మక్కి శ్రీహరి, అమదాలదిన్నె శ్రీను, సురేంద్ర, కాకి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.










