Jan 23,2022 12:09

పేరు : ఆకాంక్షా సింగ్‌
పుట్టిన తేదీ: జులై 30, 1990
పుట్టిన ప్రాంతం :
జైపూర్‌, రాజస్థాన్‌
నివాస ప్రాంతం: ముంబై, మహరాష్ట్ర
చదువు : ఫిజియోథెరపీ
నచ్చిన దుస్తులు: ట్రెండీ, ట్రెడిషనల్‌.. అన్ని రకాల దుస్తుల్ని ఇష్టపడతా.
నచ్చిన స్నాక్స్‌ : పానీపూరి.
హాబీ: గుర్రపు స్వారీ, కథలు, కవితలు రాయటం.
జీవిత భాగస్వామి : కునాల్‌ సైన్‌
తల్లిదండ్రులు : విజరు ప్రతాప్‌సింగ్‌, పాయల్‌ సింగ్‌
తోబుట్టువులు : చైనిక సింగ్‌, హరివర్ధన్‌ సింగ్‌, గౌరవ్‌ సింగ్‌

 

పెళ్లి తర్వాతా రాణించడానికి కారణం అదే..!




కథానాయికల్లో ఎక్కువ మంది వివాహం తర్వాత నటనకు స్వస్తి పలికేస్తుంటారు. అయితే పెళ్లి తర్వాత కూడా నటనలో రాణిస్తూ ముందుకు వెళ్లేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కథానాయికల్లో ఒకరు ఆకాంక్షా సింగ్‌. పెళ్లితో కథానాయిక కెరీర్‌ ముగిసిపోతుందని అభిప్రాయపడే చాలామందికి ఆమె ఓ రోల్‌ మోడల్‌లా నిలిచారు. అంతేకాదు అలాంటి అపోహల్లో ఎలాంటి నిజంలేదని, వివాహమయ్యాకే తాను ఎక్కువ అవకాశాలు అందుకున్నానని ఆకాంక్షసింగ్‌ చేసి చూపిస్తున్నారు. 'మళ్లీరావా', 'దేవదాస్‌' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి ఇప్పుడు 'పరంపర' అనే వెబ్‌ సిరీస్‌తో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగత, వృత్తిపరంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు...!

సాధారణంగా నటుల్లో హీరోలు, ఇతర ఆర్టిస్టులు ఎక్కువ మంది పెళ్లికి ముందూ తర్వాత కూడా నటిస్తూనే ఉంటారు. అయితే వారిని 'ఎందుకింకా నటిస్తున్నారు' అని ఎవరూ ప్రశ్నించరు. అదే అమ్మాయిల విషయంలో అయితే కెరీర్‌ ముగిసిపోయిందంటుంటారు. 'నేను అలాంటి మాటల్ని నమ్మను. ఎందుకంటే సినిమాకు నటన ముఖ్యం. వ్యక్తిగత విషయాలైన వయసు, పెళ్లి అనేవి కాదు. ఎవరికైతే నా నటన నచ్చుతుందో వారు తమ సినిమాల్లో నన్ను ఎంపిక చేసుకుంటారు. నా భర్త కునాల్‌ సపోర్ట్‌ నాకెప్పుడూ ఉంటుంది. ఆయన వల్లే నేను రాణించగలుగుతున్నా. నిజం చెప్పాలంటే నేను పెళ్లికి ముందుకు నటించింది కేవలం ధారావాహికలోనే. వివాహం అనంతరమే సినిమాల్లోకి వచ్చా!' అంటూ సమాధానం చెబుతున్నారు నటి ఆకాంక్షాసింగ్‌.
   గాయని, రచయిత్రి, ఫిజియోథెరపిస్ట్‌, నటి ఆకాంక్షాసింగ్‌ 'నా బోలె తుం నా కుచ్‌ కహ, గుల్మొహర్‌ గ్రంథ్‌' అనే టెలివిజన్‌ ధారావాహికల ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. దాదాపు పది ధారావాహికల్లో నటించిన అనంతరం వెండితెరకు పరిచయమయ్యారు. 2017లో 'మళ్లీరావే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అనంతరం 'దేవదాస్‌', కన్నడలో 'పహిల్వాన్‌' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోవిడ్‌ / లాక్‌డౌన్‌ కారణంగా కొంత విరామం తర్వాత మళ్లీ బిజీ అయ్యారు. ఆది పినిశెట్టితో కలిసి నటించిన 'క్లాప్‌', 'శివుడు' (తమిళం, తెలుగు), అజరు దేవ్‌గణ్‌ - అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన 'రన్‌వే 34' (హిందీ), దీప్తి (నటుడు నాని సోదరి) దర్శకత్వంలో నటించిన 'మీట్‌ క్యూట్‌' (తెలుగు) చిత్రాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కోవిడ్‌ కారణంగా వాయిదా పడ్డాయి. ఆ లోటును 'పరంపర' తీరుస్తుందని ఆకాంక్ష చెబుతున్నారు. అయితే ఈ క్రైమ్‌ డ్రామా వెబ్‌ సిరీస్‌లో తాను రచన అనే శక్తిమంతమైన పాత్ర పోషించానని, ఇది మహిళలకు స్ఫూర్తినిచ్చే క్యారెక్టర్‌ అని, కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు.
 

                                                     భాష ఓ మాధ్యమం మాత్రమే..!

నటులకైనా.. ఇతరులకైనా భాష అనేది ఓ మాధ్యమం మాత్రమే. మనం చెప్పాలనుకున్నది హావభావాలతో చెప్పేందుకు ఎలాంటి భాషా అవసరంలేదు. అన్ని చలనచిత్ర పరిశ్రమల్లోనూ పనిచేశాను. ఎమోషన్‌ పండించటమే నటిగా నా బాధ్యత. దానికోసం నా టీమ్‌ సహాయం చేస్తుంది. నాకు అర్థమయ్యే భాషలో అనువదిస్తుంది. అంతేకాదు, దేన్నైనా త్వరగా గ్రహించే లక్షణం నాలో ఉంది. అందుకే నాకు అంత కష్టమనిపించదు అని ఆకాంక్షాసింగ్‌ అంటున్నారు.
 

                                                      అందుకే సినిమాల్లోకి వచ్చా..

నాకెప్పుడూ కొత్త కొత్త పాత్రలో నటించాలనుంటుంది. అందుకే సినిమాల్లోకి వచ్చా. సినిమా సినిమాకీ పాత్రలు మారుతుంటాయి. విభిన్న గెటప్‌లతో ప్రేక్షకుల్ని అలరించవచ్చు. అదే ధారావాహికలైతే ఒకే పాత్రలో ఏళ్ల తరబడి నటించాలి. ఇప్పటికీ టీవీ నుంచి ఆఫర్లొస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉండటంతో ఆ ఆలోచన మానుకున్నా. భవిష్యత్‌లో మళ్లీ బుల్లితెరపై కనిపిస్తానో లేదో ఇప్పుడు చెప్పలేను. పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారనో, ఇంకేవో ఆకర్షించే అంశాలున్నాయనో నేనే ప్రాజెక్టును ఓకే చేయను. కథ, నా పాత్ర నచ్చితేనే ఏ సినిమాలోనైనా నటిస్తా. అయితే ముఖ్యంగా రెండు డ్రీమ్‌ రోల్స్‌ ఉన్నాయి. ఒకటి.. యువరాణిగా నటించాలని, రెండు.. బయోపిక్స్‌లో కనిపించాలనేది నా కోరిక.