కొడికొండ దగ్గర మొదలై కరిదికొండ వరకు జిల్లాలో జాతీయ రహదారి సుమారు 200 కిమీ ఉంటుంది. రహదారి ఇరువైపులా చెత్త చెదారం పోగై ఇప్పుడు దుర్గంధ పూరితంగా మారింది. సోమందేపల్లి మొదలుకొని కర్నూలు జిల్లా సరిహద్దు వరకు వెలసిన హోటళ్లు, డాబాల వ్యర్థం రోడ్డు పక్కనే వేయడం వలన మోటారు వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. దీనికి తోడు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల్లో వ్యర్థాలు ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకు పోయి మురికి కూపాలను తలపిస్తున్నాయి. తడకలేరు బ్రిడ్జి నుండి రాకపోకలు మొదలవడంతో సోములదొడ్డి సబ్ వే రోడ్డు ఇరుకుగా మారింది. 40 అడుగుల అప్రోచ్ రోడ్డు పది అడుగులయ్యింది. రోడ్డుకు ఇరువైపుల వరి కళ్లాలుగా మారాయి. సోములదొడ్డి, వడియంపేట, లోలూరు, గార్లదిన్నె, కల్లూరు, పామిడి, మిడుతూరు, గుత్తి పంట ను ఆరబెట్టడం, నూర్పిడి ఈ నాలుగు నెలలు సర్వసాధారణం. అలాగే అనంతపురం లోని సీవేజి వేస్టేజి రాత్రి పూట్ల సరిహద్దు గ్రామాల్లో వేయడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చనిపోయిన పశువుల కళేబరాలు చెరువుల్లో, రహదారి పక్కన పడవేయడంతో వాహనదారులు ముక్కు మూసుకొని పోవాల్సిన దుస్థితి నెలకొంది. రోజుల తరబడి కుళ్ళిన జంతు కళేబరాలు అలాగే భూమిలో నిక్షిప్తం కావాల్సిందే తప్ప నేషనల్ హైవే అథారిటీ, రోడ్ సేఫ్టీ పంచాయితీ రాజ్ శాఖలు మాకు సంబంధం లేని వ్యవహారం అనుకుంటున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఎవరికీ ఉపయోగపడని క్లాప్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు. నినాదాలకు పరిమితమై ఆచరణలో శూన్యంగా మారాయి. రహదారుల పక్కనే ఉన్న గ్రామాల పరిస్థితి ఇలా ఉందంటే మారుమూల ప్రాంతాలల్లో ఉన్న గ్రామాలూ ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇక గ్రామీణ ప్రాంతాలల్లో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయ్యింది. కొద్ది పాటి వర్షానికి రోడ్లన్నీ ఛండాలంగా తయారయ్యాయి. ప్రతి రోజు వ్యవసాయ పనులకోసం ఇదే దారులే గతి. పల్లెలకు వెళ్లాలంటే నరకప్రాయంగా ఉంది. కూలీలను దూర ప్రాంతాల నుండి పిలుచుకుందామని ఆటోలు మాట్లాడిన రావట్లేదు. గుంతల మయం కావడంతో తరచూ మరమత్తులు చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఆటోలోను కనీసం పది మందికంటే ఎక్కువగా ఉండటం, లోడ్ ఎక్కువగా ఉండటం వలన తరచూ క్లచ్ వైర్లు తెగిపోతున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాలకు రాక చాల కాలమయ్యింది. ఐదు సంవత్సరాల కిందట ఎలా ఉందో ఇప్పుడు అంత కంటే దారుణంగా తయారయ్యాయి. కనీసం ట్రాక్టర్ యజమానులు, జెసిబి, ట్రిప్పర్ యజమానులతో ప్రజలను భాగస్వాములను చేసి రోడ్డు కు ఇరువైపులా ఉన్న కంచెను తీసి గుంతలు పూడిస్తే కొంత కాలం అయినా ప్రజలు తిరగ గలుగుతారు. తరచూ రైల్వే ట్రాక్ మరమ్మతులు చేయడంతో ప్రజలకు ప్రత్యామ్నాయం లేక అండర్ పాస్, మోరీల కింద పోవాల్సిన పరిస్థితి. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కనీసం దారులైన మరమత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
- డా|| యం. సురేష్ బాబు










