Jan 19,2023 22:33

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : పేదలపై విద్యుత్‌ భారాలు మోపడం ప్రభుత్వానికి తగదని సిపిఎం నాయకులు అన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుదలపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో నేపథ్యంలో గురువారం ఏపీ ట్రాన్సోకో కదిరి డివిజన్‌ డిఇ మోజేష్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బడా సుబ్బిరెడ్డి, కదిరి పట్టణ కార్యదర్శి జిఎల్‌. నరసింహులు, నాయకులు రామ్మోహన్‌, బాబ్జాన్‌, ఫైరోజ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 21 వరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి విద్యుత్‌ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయా సేకరణ చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్‌ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్‌ ఛార్జీలు మోపేందుకు పన్నాగం పన్నుతోందని అనుమానం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌కు అనుకూలంగా పేదలపై పన్నుల భారం మోపడం తగదన్నారు. కదిరి పట్టణ ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని విద్యుత్‌ చార్జీల భారాన్ని వ్యతిరేకించాలని కోరారు. 2023-24 సంవత్సరానికి లోటుగా విద్యుత్‌ నియంత్రణ మండలి చూపిస్తున్న 13 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని, ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేస్తున్న ట్రూప్‌ చార్జీలను రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాలకు సంపూర్ణంగా ఉచిత విద్యుత్‌ అందించాలని, ప్రతినెల విద్యుత్‌ ఛార్జీలను సవరించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.