ప్రజాశక్తి-రాయచోటి టౌన్ : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ గిరీష తెలిపారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని యూసుఫ్ షా ఖాద్రీ(బండ్లపెంట)దర్గా, కొత్తపేట రామాపురం, తిరుపతి నాయుడు కాలనీలో డాక్టర్ వైఎస్‌ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసే ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరీష మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారమన్నారు. వైద్య రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలును నిర్మించడం జరుగుతోందన్నారు. పది నిమిషాలు నడవగానే వైద్యశాల వచ్చేలా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణాల్లో ప్రాధమిక ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది తగినంత స్థాయిలో ఉన్నారన్నారు. రాయచోటి పట్టణంలో 4 డాక్టర్ వైఎస్‌ఆర్ అర్బన్ క్లినిక్‌లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. పేదవానికి ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ మరింత పటిష్టం చేస్తామన్నారు. పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలు మార్చి కల్లా పూర్తవుతాయన్నారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. కళ్ళ ముందర అభివృద్ధి పనులు సాకారం అవుచుండడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కొత్తపల్లె వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో కలెక్టర్, ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మున్సిపాలిటీ పరిధిలోని తిరుపతి నాయుడు కాలనీలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తపేట రామాపురంలో రూ.1.65 లక్షల నిధులుతో నిర్మితమవుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల నిర్మాణాలును పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాష, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ రాంబాబు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.










