ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల పరిధిలోని కేతగాని చెరువు గ్రామానికి చెందిన దళితుల భూమి హక్కులు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దళితులు కెవిపిఎస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహశీల్దార్ మురళీకృష్ణను కలసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేతగాని చెరువు గ్రామ రెవిన్యూ పొలంలోని సర్వే నెంబర్ 323లో 1.17 ఎకరాల భూమిలో 17 దళిత కుటుంబాలకు చెందిన వారు అనేక సంవత్సరాల నుంచి అనుభవంలో ఉంటున్నారన్నారు. ఈ భూమిలో డాక్యుమెంట్ నెంబర్121-2008 మేరకు నివాసాలు, గడ్డివాములు ,పాల డైరీ ఏర్పాటు చేసుకుని 30 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులు హద్దులు ప్రకారం సర్వే చేసి రికార్డుల్లో హక్కు దారులుగా నమోదు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, సభ్యులు రవి, నాగభూషణ, షీలా నారాయణస్వామి, దళితులు అంజనమ్మ, వెంకట లక్ష్మమ్మ, హనుమక్క, సంజీవమ్మ, అంజనప్ప, నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.
సాగుదారులకు పట్టాలివ్వండి : మండల పరిధిలోని గుడిపల్లి గ్రామాలలోని 85 మంది దళిత , బీసీ వర్గాలకు చెందిన భూమిలేని నిరుపేదలు పందిపర్తి రెవిన్యూ పొలం సర్వే నంబర్ 384 నందు దాదాపు 180 ఎకరాలు విస్తీర్ణంలో ఉమ్మడిగా సాగు చేసుకుంటున్నారని వారికి 8వ విడత భూ పంపిణీలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని వ్యకాసం నాయకులు కోరారు. ఈసందర్భంగా వారు సంబంధిత విఆర్‌ఓ సాగుదారులతో కలిసి సాగు భూములను మంగళవారం పరిశీలించారు. ఈసందర్బంగా వీఆర్వో మాట్లాడుతూ రైతులు సాగుచేసిన విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు హనుమయ్య , జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేషులు , సిఐటియు మండల నాయకులు కొండా వెంకటేశులు , భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగభూషణ , సాగు దారులు గంగాభవాని , శ్యామల , అంబికా , అంజనమ్మ , అంజనప్ప తదితరులు పాల్గొన్నారు.










