Dec 02,2022 22:10

ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతున్న సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలో ఒకట స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిఐ పేదలకో న్యాయం..పెద్దలకో న్యాయం చేస్తున్నారని, ఆయనపై విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహ్మప్ప డిమాండ్‌ చేశారు. సిఐ తీరుకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్బంగా సిఐకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, రెవిన్యూ అధికారికి వినతిని ఇచ్చారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ 14రోజుల క్రితం ఆగి ఉన్నా ఆటోకు ఆర్‌టిసి అద్దె బస్సు డీకొన్న ప్రమాదంలో గాయపడిన కార్మికులను జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించామన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేయాలని సిఐను కోరామన్నారు. అయితే ఆయన బస్సు ఓనర్‌తో చర్చించి బస్సును వదిలి 14 రోజుల నుంచి కేసు నమోదు చేయకుండా ఆటోను బయటకు పంపకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన ఆటోను నమ్ముకుని జీవనం చేస్తున్న ఆటో కార్మికుడు శనివారమప్ప కుటుంబ జీవనం కష్టంగా మారిందన్నారు. ప్రతి రోజు ఆటో కార్మికుడు స్టేషన్‌కు వెళుతున్న సిఐ అతనికి న్యాయం చేయక పోగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిఐ పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ వ్యవహార శైలిపై అధికారులు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఆటో కార్మికుడికి 14 రోజుల నష్ట పరిహారాన్ని ఇవ్వాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు జగదీష్‌, నాయకులు రామకృష్ణ, అత్తార్‌బాబా, జబివుల్లా, బాబురెడ్డి, రీయాజ్‌, మల్లికార్జున, రఫీ తదితరులు పాల్గొన్నారు.