Jan 04,2023 20:06

లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్‌ : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎన్‌విఆర్‌ కళ్యాణ మండపంలో వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామన్నారు. కొన్ని చిన్న చిన్న సాంకేతిక కారణాలవల్ల పింఛన్లు రానివారు ఆయా సచివాలయాలలో దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి దరఖాస్తును పరిశీలించి పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 7020 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందింస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ ద్వారా మీ ఇళ్ల దగ్గరకే డాక్టర్లు వచ్చి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందన్నారు. ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని సిఎం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది పింఛన్‌ పెంపుదల చేశారన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోజారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ యోగక్షేమాలు చూస్తూ జగనన్న పాలన కొనసాగిస్తున్నారు. 879 మందికి కొత్త పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జింక చలపతి, జడ్‌పిటిసి ఉదరు కుమార్‌, ఆర్‌డిఒ మురళి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ఎంపిడిఒ తాజ్‌ మజురుద్‌, పింఛనుదారులు పాల్గొన్నారు.