ప్రజాశక్తి -వెంకటాచలం :బడుగు, బలహీన వర్గాలసంక్షేమమే ప్రభుత్వ మొదటి లక్ష్యమని, అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరితపిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎర్ర గుంటలోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన సామాజిక పింఛన్లు అందజేసే కార్యక్రమంలో మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ గతంలో సామాజిక పింఛన్ మంజూరు కావాలంటే ఆయా గ్రామాల్లో అప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులు మరణించినప్పుడు మాత్రమే మంజూరు చేసే దౌర్భాగ్యపు పరిస్థితులు ఉండేవన్నారు. ప్రస్తుతం పెన్షన్ మంజూరుకు నిర్దేశించిన అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అన్నింటిని పరిశీలించి మంజూరు చేస్తున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు.అనంతరం కొత్తగా మంజూరైన పింఛన్లు అందజేశారు. డిఆర్‌డిఎ పీడీ సాంబశివరెడ్డి ఎంపీడీవో సుస్మిత, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుల కోడూరు కలపలత, ఎంపిపి మంద కవిత, ఉపయం పీపీ కోదండరామిరెడ్డి, టిసి మందల వెంకట శేషయ్య, కసుమూరు కనపూరు సర్పంచులు నాటకం శ్రీనివాసులు, కడివేటి శివ పాల్గొన్నారు.










