పెనుకొండ : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం లక్షలాది మంది పింఛన్లు అన్యాయంగా తొలగిస్తూ పేదల కడుపుకొడుతోందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సవితమ్మ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3వేల రూపాయలు పింఛను ఇస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పాడని విమర్శించారు. వివిధ రకాల సాకులతో సచివాలయ అధికారులచే నోటీసులు ఇస్తూ పింఛన్లు తొలగించడానికి కుట్ర పన్నారని అన్నారు. పెనుకొండ నగర పంచాయతీలో పరిదిలోని ఇందిరమ్మ ఇంటిలో నివసిస్తున్న నిరుపేదకు 158 ఇళ్లుఉన్నాయంటూ పింఛన్ నిలిపివేత నోటీసు అందజేశారని అలాగే ఇస్లాపురం గ్రామానికి చెందిన రజక రామక్క అనే వితంతువుకు 158 ఇళ్లు ఉన్నాయని, అవన్నీ 1,30,649 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఉన్నాయని పింఛన్ నిలిపివేస్తున్నట్టు సచివాలయ ఉద్యోగులు నోటీసు అందించారని చెప్పారు. అర్హులకు పింఛన్లు ఇచ్చే వరకు పోరాడుతామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు గుట్టూరు సూర్యనారాయణ, శ్రీరాములు, త్రివేంద్ర నాయుడు, కౌన్సిలర్ గీతా హనుమంతు, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










