May 24,2023 21:13

లబ్ధిదారులకు మెగా చెప్పిన అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : పేద విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వరంలాంటిదని కలెక్టర్‌ గిరీష అన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ నుండి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండవ విడత జగనన్న విద్యా దీవెన లబ్ది మొత్తాన్ని ల్యాప్‌ టాప్‌ బటన్‌ నొక్కి అర్హులయిన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ విసి హాలు నుంచి జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి ఆర్థిక లబ్దిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో కలెక్టర్‌ గిరీష, డిఆర్‌ఒ సత్యనారాయణ, జిల్లా ఎస్‌సి సంక్షేమ, సాధికారత అధికారి జాకీర్‌ హుస్సేన్‌, జిల్లా బిసి వేల్ఫేర్‌ అధికారి సందప్ప, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్సులం, వివిధ సంక్షేమ అధికారులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లులు పాల్గొ న్నారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 31,759 మంది విద్యార్థులకు గాను అర్హులైన 28,936 మంది తల్లుల ఖాతాలలో రూ.26.94 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదు చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెనను ప్రభుత్వం ప్రవేశపెట్టిందాన్నారు. ఈ పథకం కింద ఐటిఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ నేరుగా వారి ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.