ప్రజాశక్తి కదిరి టౌన్ : పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కషి చేస్తానని బ్లూమున్ విద్యాసంస్థల అధినేత శివశంకర్ పేర్కొన్నారు. కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ సమీపంలోని బ్లూ మూన్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఆటపాటలతో జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యాసంస్థల అధినేత ఎం శివ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి పూర్తిస్థాయిలో అండగా ఉంటూ వారి ఎదుగుదలకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యతను పెంచేందుకు కళాశాలలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అందుకు తగిన ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. తమ విద్యాసంస్థ లో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని సూచించారు. విద్యాపరంగా ఏ సమస్య వచ్చిన తమను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యాసంస్థల అధినేత ఎం.శివ శంకర్, సెక్రటరీ శ్రీదేవిని అధ్యాపకులు, విద్యార్థులు, ఘనంగా సత్కరించారు. అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాధాకృష్ణారెడ్డి, సీనియర్ ఆధ్యాపకులు చలపతి, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.










