ప్రజాశక్తి-కనగాన పల్లి : వైసీపీ ప్రభుత్వం పేద,దళిత రైతుల భూముల సోలార్ ప్రాజెక్టు పేరుతో కారు చౌకగా లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని బానుకోట వద్ద సోలార్ పేరుతో మంత్రి ఉషశ్రీ చరణ్ తీసుకొన్న భూములను సిపిఎం మండల కార్యదర్శి బత్తల కదిరప్ప, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జునతో కలిసి ఇంతియాజ్ ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత పేద, దళిత రైతులను భూమికి దూరం చేసి వారిని కూలీలుగా మార్చుతోందన్నారు. సోలార్ ప్రాజెక్టుల పేరుతో కారు చౌకగా సేకరించిన భూముల్లో వైసీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మంత్రి ఉషశ్రీ చరణ్ భానుకోట వద్ద సోలార్ పేరుతో భూములు తీసుకుందన్నారు. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులంతా దళితులే అని వారికి ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కారు చౌకగా కొట్టేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి సూమారు 80 వేల ఎకరాల భూములు ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. నిర్వాసితులకు తగిన పరిహారం, ప్రత్యామ్నాయ భూముల ఉపాధి చూపకుండా వారిని కూలీలుగా మార్చే కుట్రను వైసిపి ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే వరకు ప్రజల మద్దతు కూడగట్టి పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధి మరచి ఇసుక, భూములు కొనుగోలు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మంత్రి ఉషశ్రీ చరణ్ తీసుకున్న భూముల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.










