Feb 24,2022 07:04

ప్రాథమిక పాఠశాలలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్క్యులర్‌ 172 విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు తరలించనుంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్‌ పరిధిలో వుండాలన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1,2 తరగతుల పిల్లలను అంగన్‌వాడీలకు అప్పగించనుంది. అందుబాటు లోని ప్రాథమిక విద్యను పేదలకు అందకుండా చేస్తోంది. ప్రాథమిక పాఠశాలలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్వగ్రామమైన చినమేరంగి హైస్కూల్‌లో 2.25 కిలోమీటర్ల దూరంలోవున్న అల్లువాడ, దాసరిపేట, తాళ్లడుమ్మ, చినమేరంగి కాలనీ, చినమేరంగిలోని ఆరు ప్రాథమిక పాఠశాలలను కలిపేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలను మూసేసే పని ప్రారంభించింది.

ప్రభుత్వ చర్యల వల్ల ప్రాథమిక పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లలేనంత దూరం పెరుగుతుంది. 3,4,5 తరగతుల పిల్లలు కిక్కిరిసిన రద్దీతో వాహనాలు తిరుగుతున్న రోడ్లను దాటి సురక్షితంగా పాఠశాలకు వెళ్లి రాగలారా? సాధ్యం కాదు. వెళ్లిన పిల్లలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. దూరంగానున్న బడులకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడితే వారే తీసుకెళ్లి తీసుకురావాలి. లేదంటే ఆటోలకు పంపించాలి. ప్రతి పేటలో పిల్లలు బడికెళ్లి సురక్షితంగా రావడానికి వీలుగా బడులు పెట్టారు. వయసును బట్టి పిల్లల మానసిక ఎదుగుదల, పరివర్తనలో తేడా వుంటుంది. అందువల్ల చిన్న పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ఒకే ఊరిలో ప్రైమరీ, హైస్కూల్‌ ఏర్పాటు చేశారు. ఆడుతూ, పాడుతూ, ఏడుస్తూ బడికి వెళ్లే ఆరేళ్ల పిల్లడు, 13 ఏళ్లు దాటిన పిల్లలతో ఇమడలేడని గుర్తించి... అనేక కమిషన్ల సూచన ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాల నెలకొల్పారు. ఇపుడా ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏకపక్షంగా మూసేస్తోంది.

వ్యవసాయం, కూలి పని చేసుకునే జనం తెల్లారగానే పనిలోకి పోవాలి. రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు రావడం సాధ్యం కాదు. కనుక పిల్లలను ఆటోలకు పంపించాలి. అందుకు డబ్బు పెట్టాలి. 'అమ్మ ఒడి'కి ఇచ్చిన డబ్బు అందుకు సరిపోవచ్చు. కుటుంబంలోని మిగతా పిల్లలకు 'అమ్మ ఒడి' వర్తించదు కనుక తల్లిదండ్రులు చేతి డబ్బు పెట్టుకోవాలి. లేదంటే పిల్లలను బడికి పంపడం ఆపేస్తారు. 'అమ్మ ఒడి' శాశ్వత పథకం కాదు. ప్రభుత్వం మారితే 'అమ్మ ఒడి' వుండదు. 'అమ్మ ఒడి' లేకపోతే తల్లిదండ్రులపై చదువుల భారం పెరుగుతుంది. అధికారం లోకి రేపు ఎవరొచ్చినా మూసేసిన పాఠశాలలను తెరిపించరు. అందుకని సర్కారు బడులను సంరక్షించుకోవడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.

మౌలిక సదుపాయాలు లేకుండానే....
హైస్కూళ్లకు తరలిస్తున్న 3,4,5 తరగతుల పిల్లలకు తరగతి గదులున్నాయా? బెంచీలు, కుర్చీలున్నాయా? ఇతర మౌలిక సదుపాయాలున్నాయా? అవేమీ లేవని అన్ని చోట్లా ఒకటే మాట. మరెందుకు ఇంత తొందర? హైస్కూళ్లలో తరగతి గదులు లేవు గనుక టీచర్లు విలీన తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పాలట? గంట గంటకు ప్రైమరీ స్కూల్‌ నుండి హైస్కూలుకు, హైస్కూల్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌కు టీచర్లు పరుగులు తీయాలా? సాధ్యాసాధ్యాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలతోనైనా ప్రభుత్వం చర్చించలేదు? మేము నిర్ణయించాం. మీరు అమలు చేయండి అని విద్యాశాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.

యువతకు తీరని అన్యాయం
ప్రపంచబ్యాంకు సలహాతో చంద్రబాబు ప్రారంభించిన విద్య ప్రైవేటీకరణను రాజశేఖరరెడ్డి విస్తృత పరిచారు. ప్రైవేటు బిఇడి కాలేజీలకు విస్తారంగా అనుమతులు ఇచ్చి ట్రైనింగ్‌ పూర్తి చేస్తే టీచర్లు అవుతారనే భ్రమ యువతలో కల్పించారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసి ట్రైనింగులు, ఆపైన కోచింగులు పూర్తి చేసి టీచర్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఆశాభంగమే మిగిలింది. ప్రాథమిక పాఠశాలల మూసివేత మూలంగా ఖాళీగా ఉన్న 25 వేలు టీచర్‌ పోస్టులు భర్తీ చేయకపోగా మరో 75 వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు తేలుస్తున్నారు. ఇపుడున్న 1 : 30 విద్యార్థి, టీచర్‌ నిష్పత్తిని 1 : 35 గా మార్చేశారు. గత రెండేళ్లు డీఎస్సీ లేదు.
 

ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి లు ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి
వేల సంవత్సరాల పాటు భూమిపై హక్కు లేక ఆర్థిక అణచివేతకు, చదివే హక్కు లేక కుల పీడనకు గురైన ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి సామాజిక తరగతుల ప్రజలు ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉండడంతో కొంతమేరకైనా చదువుకోగలుగుతున్నారు. అత్యంత వెనకబడిన తరగతుల (ఎం.బి.సి) పిల్లలు నేటికీ ప్రభుత్వ బడికి కూడా వెళ్లలేకపోతున్నారు. ఈ తరగతుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారు. ఉన్నత సామాజిక తరగతుల్లోని పేదలు కూడా నష్టపోతారు. నూతన విద్యావిధానం అమలు చేయడం అంటే ఇదే! విద్యారంగంలో తిరోగమనాన్ని నిలవరించి అందరికీ ప్రభుత్వ విద్య అందే విధంగా, విద్యా హక్కు అమలు సంపూర్ణంగా జరిగేలా విశాల ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం నేడు మన ముందుంది.

పేద పిల్లలకు విద్య దూరం...తల్లిదండ్రులకు భారం...

ఎం.కృష్ణమూర్తి