కార్మికులతో మాట్లాడుతున్న కమిషనర్
పెద్దల పండుగలో పటిష్టమైన పారిశుద్ధ్య ఏర్పాట్లు
నెల్లూరు :సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతీయేటా బోడిగాడి తోటలోని సమధుల తోటలో నిర్వహించే పెద్దల పండుగలో పారిశుధ్య నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత తెలిపారు. అధికారులతో కలిసి స్థానిక బోడిగాడి తోటలో జరుగుతున్న పెద్దల పండుగ నిర్వహణ ఏర్పాట్లను కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమాధుల ప్రాంగణాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. సమాధులకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో సున్నాలు వేయించాలని, పశువులు, పందులు ప్రాంగణంలో సంచరించకుండా జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు. సమాధుల ప్రాంగణం మొత్తం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాధులను దర్శించడానికి విచ్చేసే ప్రజల సౌకర్యార్థం విద్యుత్ వెలుగులు, మంచినీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంజరు, చంద్రయ్య, అనిల్, సచివాలయ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.










