పడమటినాయుడుపల్లిలో కలెక్టర్ పర్యటన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పడమటినాయుడుపల్లిలో కలెక్టర్ హరినారాయణన్ శుక్రవారం పర్యటించారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి పడమటినాయుడుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన సమయంలో హైలెవల్ కెనాల్ ముంపు బాధితులు తమ సమస్యను తెలపడంతో వెంటనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ కలిసి వినతిపత్రం సమర్పించి రైతులకు నష్టపరిహారం త్వరగా అందించేలా చూడాలని కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్ హైలెవల్ కెనాల్ ముంపు బాధితులతో సమావేశమై మాట్లాడి కొందరి భూమికి సంబంధించిన పాసుపుస్తకాలను పరిశీలించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి కలిసి విన్నవించడంతో తాము బాధితులతో మాట్లాడేందుకు వచ్చామని, త్వరగా భూ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని, పరిహారం, పునరావాసం, మిగిలిన రెవెన్యూ పనులు సైతం త్వరగా చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని వివరించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్న ఎంఎల్‌ఎకు గ్రామ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కంపసముద్రం సమీపంలో జరుగుతున్న సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 2 పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ సువర్ణమ్మ, ఆత్మకూరు ఆర్‌డిఒ కరుణకుమారి, ఇన్‌ఛార్జి తహశీల్దారు ఆనందరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సురేంద్ర, పలువురు అధికారులు పాల్గొన్నారు.










