ప్రజాశక్తి-రాయచోటి: పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయ కారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులని కలెక్టర్ గిరీష అన్నారు.శనివారం రాయచోటి కలెక్టరేట్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల చిత్రపటానికి కలెక్టర్, డిఆర్‌ఒ సత్యనారాయణ, జిల్లా పర్యాటకశాఖ అధికారి నాగభూషణం, కలెక్టరేట్ ఎఒ బాలకృష్ణ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పద కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందిన అన్నమయ్య తొలి తెలుగు వాగ్గేయకారుడని అన్నారు. తన జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యానికి అంకితం చేసిన ధన్యజీవన్నారు. అనేక సాంప్రదాయాల్లో రచనలు చేసిన తర్వాత పదకర్తలకు మార్గదర్శకుడు అయ్యారన్నారు. మనుషులంతా సమానమేనని అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలిపారన్నారు. అన్నమయ్య రచించిన 32 వేల కీర్తనలలో కేవలం ఆధ్యాత్మిక భావాలే కాకుండా కులభేదాల నిరశన, సామాజిక స్పహ, మానవీయ విలువలు ఎన్నో ఉన్నాయన్నారు. అన్నమయ్య వాడింది ప్రజల భాష అని కొనియాడారు. ఆ సాహిత్యంలో ఉన్న ఎన్నో జానపద బాణీలు, దేశ్య పదాలు, పలుకుబడులు, సామెతలు, జాతీయాలు అన్నమయ్య కవితాసౌందార్యానికి, స్వచ్చమైన భావసంపదకు దష్టాంతాలన్నారు. అంతటి మహనీయుని జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.










