ప్రజాశక్తి - పెనుకొండ : వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు , భూ రక్ష పథకం కింద చేపడుతున్న రీసర్వే సజావుగా నిర్వహించాలని అందుకోసం సర్వే, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ భువనవిజయం మందిరంలో వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం - 2020పై తహశీల్దార్లు, ఎంపిడిఒలు, రీసర్వే డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, ఇఒఆర్‌డిలు, విఆర్‌ఒలతో వర్క్ షాపు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వందేళ్ల తరువాత చేపడుతున్న భూ సర్వే ద్వారా భూ సమస్యల్లో నెలకొన్న సమస్యలను సజావుగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. స్పందనలో వచ్చే అర్జీల్లో 70 శాతంపైగా భూ సమస్యలకు సంబంధించే ఉన్నాయన్నారు. ఈ సర్వే సజావుగా పూర్తి కావాలంటే సర్వే, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. దీని ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. డిసెంబర్ 2023వ సంవత్సరం నాటికి జిల్లాలోని 461 గ్రామాలలో రీ సర్వేను పూర్తిచేయాలన్నారు. రీసర్వేపై నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, రీసర్వేలో డేటా ఎంట్రీ నుంచే సక్రమంగా సరిచూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్‌తో పాటు పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు తగిన చర్యలు
పరిశ్రమల పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పెనుకొండ మండలంలోని ఎన్వీహెచ్ గ్రూప్ కంపెనీ, పిసిబి విడిభాగాల తయారీ యూనిట్, ఫూరిషియా, హుండారు స్టీల్, హుండారు గ్లోవిస్ తదితర పరిశ్రమలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో మిషన్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయా పరిశ్రమల హెచ్ ఆర్ మేనేజర్లతో మాట్లాడారు. ఆయా పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్‌బాషా, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ కేశవులు, లేబర్ డిప్యూటీ కమిషనర్ రఘురాములు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శంకర్‌రావు, పరిశ్రమల శాఖ డిడి మహబూబ్ బాషా, ఎన్వీహెచ్ గ్రూప్ ఎమ్‌డి సిమోన్ సాంగ్, హెచ్‌ఆర్ అడ్మిన్ డైరెక్టర్ సిబి హన్, ప్లాంట్ హెడ్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.లి










