Mar 10,2023 22:05

పది పరీక్షల నిర్వహణపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

        పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్‌ఎస్‌సి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పది పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 424 పరీక్ష కేంద్రాల్లో 25,881 మంది విద్యార్థులు పరీక్షలు రాయన్నారని చెప్పారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు కూడా ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనున్నాయన్నారు. ఇందులో ఓపెన్‌ స్కూల్‌ ఎస్‌ఎస్సీ పరీక్షల కోసం జిల్లాలో ఐదు సెంటర్లలో 30 పరీక్ష కేంద్రాల్లో 824 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షలను జిల్లాలో 9 సెంటర్లలో 38 పరీక్ష కేంద్రాల్లో 1,605 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఆయా పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలో జరుగుతున్న మొదటి పరీక్షలను విజయవంతం చేసేందుకు అధికారులంతా నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్ష హాల్లోకి ఏ విధమైన సెల్‌ ఫోన్‌ లు తీసుకురాకుండా చూడాలన్నారు. సిబ్బంది కూడా ఎవరూ కేంద్రంలోకి సెల్‌ ఫోన్‌ తీసుకురాకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సమయానికి ఉదయం, మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, తగినన్ని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పరీక్ష జరిగేరోజుల్లో కేంద్రాల పరిధిలో జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయించాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో మీనాక్షి, అడిషినల్‌ ఎస్పీ కెవిఆర్‌కె.ప్రసాద్‌, డీవీఈవో రఘునాథరెడ్డి, డిఎంహెచ్‌ఒ డా||కష్ణారెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన్‌, హిందూపురం పోస్ట్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కళ్యాణ్‌ రామ్‌ తదితరులు పాల్గొన్నారు.