Mar 29,2023 20:46

- ఆర్‌జెడ్‌ని కలిసిన యుటిఎఫ్‌ నాయకులు

కడప అర్బన్‌ : త్వరలో జరగబోవు 10వ తరగతి పరీక్షల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు కొత్త పిఆర్‌సి ప్రకారం రెమ్యూనరేషన్‌ పెంచాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు కోరారు. బుధవారం పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు బండపల్లి ప్రతాపరెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో పాల్గొనే చీప్‌, డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్లకు రూ.44, ఇన్విజిలేటర్లకు నామమాత్రంగా రూ.22 పారితోషికం ఇస్తున్నారని కోరారు. 10వ తరగతి పేపర్లు మూల్యాంకనం చేసినందుకు ఒక్కొక్క పేపర్‌కు రూ.6.60 మాత్రమే ఇస్తున్నారని, ఈ నాటి ధరల్లో ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని వెంటనే వీటిని సవరించి నూతన పిఆర్‌సి ప్రకారం మెరుగైన పారితోషికం ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చించి అమలు పరచాలని కోరారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న దష్ట్యా పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ ఆయా పరీక్ష కేంద్రాలలో మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఇచ్చే విధంగా ఆలోచించాలని తెలిపారు. పదవ తరగతి మూల్యాంకనంలో అనారోగ్యాలతో బాధపడే ఉపాధ్యాయులను,చంటి బిడ్డ తల్లులను, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, 60 ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఎ 4 మార్కులు ఆన్‌లైన్‌ ఎంటర్‌ చేయడానికి సర్వర్‌ సరిగా పనిచేయడం లేదని అధికారులు మాత్రం తొందర పెడుతున్నారని దీనివల్ల ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారని, సర్వర్‌ స్పీడ్‌గా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఫేషియల్‌ అటెండెన్స్‌ విషయంలో పదినిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ను అమలు చేయాలని పేర్కొన్నారు. పై విషయాలు సావధానంగా విన్న ఆర్‌జెడి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా పరీక్షల విధులు, మూల్యాంకన విధుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారులకు సహకరించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు సుజాత రాణి, ట్రెజరర్‌ దావుద్దీన్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ నరసింహారావు, నాయకులు గురు మోహన్‌ పాల్గొన్నారు.