ప్రజాశక్తి - కదిరి టౌన్ : కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఉన్నతాధికారులు అనంత సంకల్పం తలపెట్టారు. మెరుగైన ఫలితాలు లక్ష్యంగా లక్ష్యసాధనకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రతి ఏడుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని చొప్పున విద్యార్థుల ఇళ్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి వారి రోజువారి కార్యాచరణను పరిశీలించి అర్థం కాని సబ్జెక్టులను వివరిస్తూ మెరుగైన ఫలితాలే లక్ష్యంగా కార్యచరణ చేస్తూ సన్నద్ధం చేశారు. గతేడాతో పోలిస్తే ఈ ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఫలితాలు లక్ష్యంగా ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టులు వారిగా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. కదిరి పట్టణంలోని వీవర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ , కుటాగుల మున్సిపల్ హై స్కూల్ నందు దాదాపు ఒక స్కూల్ నందు 140 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే ఉన్నత చదువులకు ఆది దోహదపడుతుంది. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థుల దశ దిశా మార్చడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 140 మంది విద్యార్థులకు గాను 20 గ్రూపులుగా విభజించి ప్రతి ఏడుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని లేదా ఉపాధ్యాయురాలిని నియమించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఎప్పటికప్పుడు ప్రతి సబ్జెక్టు పైన మెలకువలు తెలియపరుస్తూ విద్యార్థులు ప్రతి సబ్జెక్టు పైన పట్టు సాధించేలా దిశా నిర్దేశం చేస్తున్నారు.
నేటి నుండి పద పరీక్షలు : పదవ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12: 45 వరకు నిర్వహించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లును అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో వందశాతం ఫలితాలు సాధించడానక అందుకు తగినట్టుగా ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వీవర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నాగరాజు చెప్పారు. ఏ సబ్జెక్టు కు ఆ సబ్జెక్టు టీచర్లను కేటాయించి మాదిరి ప్రశ్నాపత్రాలు సిద్ధం చేసి రోజువారీ మాదిరి పరీక్షలు ప్రతిరోజు నిర్వహించామన్నారు. ప్రతి విద్యార్థి మెరుగైన ఫలితాలు సాధించడమే తమముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ప్రతి విద్యార్థిన సన్నద్ధం చేశామని సైన్సు ఉపాధ్యాయిని హరిత తెలిపారు.










