ప్రజాశక్తి - రాయచోటి : అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అందరూ కషి చేయాలని కలెక్టర్ గిరీష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష ఉంటుందనిమ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద144 సెక్షన్ ఏర్పాటు చేసి పటిష్ట పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 52 పరీక్షా కేంద్రాలకు గాను ఇంటర్ మొదటి సంవత్సరం 13,934 మంది, రెండవ సంవత్సరం14,446 మంది, మొత్తం 28,380 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నాని చెప్పారు. ఇంటర్ పరీక్షలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా 10 మంది సిట్టింగ్ 4 ప్లేయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంటర్ మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్, ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్ష కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షలు జరిగే రోజు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయించి 144 సెక్షన్ విధించాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదని పేర్కొన్నారు. ఎండ తీవ్రతను దష్టిలో ఉంచుకొని తాగునీరు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 7.00 గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ వారికి సూచించాలన్నారు. ప్రతి జిల్లాలోనూ జిల్లా హెడ్ క్వార్టర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలలో ఎటువంటి మాస్ కాపీలు జరగకుండా ప్లేయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎఎన్‌ఎంలను నియమించి చేసి 108 వాహనం అందుబాటులో ఉంచాలన్నారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు లా అండ్ ఆర్డర్ తప్పక పాటించాలన్నారు. సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఆర్‌ఒ సత్యనారాయణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










