May 06,2023 21:10

సమావేశంలో మాట్లాడుతున్న నరసింహ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌: ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న సాయి విద్యాలయ, అక్షర పాఠశాలలపై విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలకు పాల్పడుతూ సాయి విద్యాలయ, అక్షర పాఠశాలలు కట్టిన బ్యానర్లను శనివారం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తొలగించి ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు అడ్మిషన్ల కోసం ప్రచారాలకు పాల్పడుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు వ్యవహరిస్తున్నా మండల విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ముందస్తు అడ్మిషన్లకు ప్రచారాలకు ఎవరు పాల్పడిన చర్యలు తీసుకుంటామని డిఇఒతో పాటు విద్యాశాఖ అధికారులు, జిఒ విడుదల చేసి పత్రికా ప్రకటనలలో పేర్కొన్నా మండల విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, నాయకులు కార్తీక్‌, ఉపేంద్ర, అఖిల్‌ పాల్గొన్నారు.