పాఠశాలలో డిప్యూటీ డిఇఒ తనిఖీలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అవకతవకలపై పలు కథనాలు ప్రచురితమవగా స్పందించిన అధికారులు స్కూలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూలు ప్రధానోపాధ్యాయుని రాతపూర్వక వివరణ కోరినట్లు డిప్యూటీ డిఇఒ హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బాలికల వసతులపైన జగనన్న గోరుముద్ద మధ్యాహ్నం భోజనంపై పలు విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో అక్కడున్న సిబ్బందికి పలు సూచనలు చేసి ఖచ్చితంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాదాపు 120పైగా విద్యార్థినులు ఆ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తుండగా అందరికీ కలిపి మరి దారుణంగా ప్లాస్టిక్ పట్టలతో కవరు చేసిన ఒక చిన్న మూత్రశాల ఉండడం ఆయనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. వెంటనే ఆయన ఉపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటు చేసి నాడు నేడు పనుల విషయమై ఆరా తీయగా బిల్లుల విషయమై పనులు ఆగిపోయినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. వెంటనే ఆయన బాలికలకు మరుగుదొడ్లను యుద్ధ ప్రాతిపదిన ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన నిధులను వెంటనే మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో పిల్లల తల్లిదండ్రులు కొంతమంది గ్రామస్తులు డిప్యూటీ డిఇఒ స్కూలుకు వచ్చిన విషయం తెలుసుకొని ఆయనను కలవడానికి ప్రయత్నించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన వాళ్లు లేవనెత్తిన బాలికల మరుగుదొడ్డి, పలు సమస్యలకు వెంటనే సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత డిఇఒకు పూర్తి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎంఇఒ మస్తాన్ వలీ, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.










