- జడ్‌పీలో స్వపక్షమే విపక్షం
- సమస్యలు ఏకరువు పెట్టిన పాలకపక్ష సభ్యులు
- సమస్యలు పరిష్కరించడంలేదని అధికారులపై మండిపాటు
ప్రజాశక్తి - కలెక్టరేట్ : పాఠశాలల విలీన ప్రక్రియపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'దీనిపై మా అభిప్రాయం తీసుకోరా, విలీనం వల్ల కొన్ని ప్రాంతాల్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వేసవి కాలంలో చేయాల్సిన కాల్వల ఆధునీకరణ, తూడు తొలగింపు పనులు వర్ష కాలంలో చేపట్టడం రైతుల కోసమా, కాంట్రాక్టర్ల కోసమా'' అంటూ పలువురు సభ్యులు కృష్ణాజిల్లా పరిషత్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెబుతుంటే ఈ క్రాప్ కాలేదనే సాకుతో పూర్తి స్థాయిలో ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ అధికార పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు, జడ్‌పిటిసి సభ్యులు జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కష్ణాజిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జెడ్ పి చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా చైర్‌పర్సన్ హారిక మాట్లాడుతూ గత సమావేశంలో తీర్మానించిన విధంగా కష్ణాజిల్లా పరిధిలో ప్రతి జడ్పిటీసీకి రూ.20 లక్షల చొప్పున సాధారణ నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులు రూ.13 కోట్లతో 306 పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో రోడ్ల అభివద్ధి పనులు, ఇరిగేషన్ పనులు ఉన్నాయని చెప్పారు. ఈ పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. విజయవాడలో స్థాయీ సంఘం సమావేశాల నిర్వహణ నిమిత్తం జడ్‌పి మీటింగ్ హాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. జడ్పీ ఆదాయ వనరులు పెంచడం కోసం కషి చేస్తున్నట్లు తెలిపారు.
వర్షాకాలంలో పనులు కాంట్రాక్టర్ల మేలు కోసమా
శాసన సభ్యులు కొలుసు పార్థ సారధి
పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారధి. మాట్లాడుతూ కాల్వలు, డ్రైన్ల ఆధునీకరణ, తూడు తొలగింపు పనులు ఫిబ్రవరిలోనే చేపట్టాలని చెప్పినా వర్షాకాలంలో చేపట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పనులు రైతుల కన్నీళ్లు తుడవడానికా లేక కాంట్రాక్టర్ల మేలు కోసమా అంటూ అధికారులను నిలదీశారు. ప్రతి రైతు ఈ క్రాప్ చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, తన నియోజకవర్గం ముదునూరులో 450 ఎకరాలు ఈ -క్రాప్ జరగలేదని, ఇందుకు కారణాలు చెప్పాలని అధికారులను నిలదీశారు. పశుసంవర్ధకశాఖలో కేంద్ర పథకం నేషనల్ లైవ్ స్టాక్ పథకం కింద 50 శాతం సబ్సిడీతో ఎంత మందికి పాడి గెదేలు మంజూరు చేశారని ఆయన ప్రశ్నించారు.
పంటల బీమా ఎంత మంది మిర్చి రైతులకు ఇచ్చారు
పిడిఎఫ్ ఎంఎల్‌సి లక్ష్మణరావు ప్రశ్న
వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఎంత మంది మిర్చి రైతులు లబ్ధిపొందారని పిడిఎఫ్ ఎంఎల్‌సి కె.ఎస్.లక్ష్మణరావు అధికారులను ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 వేల ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిందని, ఎన్టీఆర్ జిల్లాకు రూ.123 కోట్ల మేర పంటల బీమా మంజూరు కాగా, మిర్చి రైతులకు రూ.64 కోట్ల అందించినట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాలల విలీన ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియపై విద్యార్థులు, వారి తల్లి దండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న సంఘటనలు చూస్తున్నామని గుర్తుచేశారు. అలాగే కొన్ని హైస్కూళ్లను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశారని, ఇది శుభపరిణామమని అన్నారు. అయితే స్థానిక ప్రజా ప్రతినిధులతో కూడా సంప్రదిస్తే బాగుండేదని అన్నారు. ఇప్పటికైకా వారితో చర్చించి కమిటీ ఏర్పాటు చేస్తే కళాశాలల గురించి ప్రచారం చేస్తారని, దీంతో అక్కడ విద్యార్దులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అలాగే పాఠశాలల విలీనంపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోరా అంటూ పలువురు జడ్‌పిటిసిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. గన్నవరం కోఆప్షన్ సభ్యులు గౌస్ ముహుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విలీన ప్రక్రియ జరగడంలేదన్నారు. గన్నవరం బాలికల హైస్కూల్లో తగినన్ని తగరగతి గదులున్నా హైస్కూల్ ప్లస్ కింద బాలికల జూనియర్ కళాశాలను బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేయడం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేశారు.
పంటల బీమాలో వ్యత్యాసం ఎందుకు ?
ఎంఎల్‌సి అరుణ్‌కుమార్
ఎంఎల్‌సి మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లోని మిర్చి రైతులకు రూ.49,500 చొప్పున, మిగతా మండలాల్లో రూ.18,500 చొప్పన పంటల బీమా అందడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యత్యాసం ఎందుకని అధికారులను నిలదీశారు. మళ్లీ పరివీలించి సరిచేయాలన్నారు. లేకపోతే కార్యాలయం ముందు రైతులతో ధర్నా చేస్తానని హెచ్చరించారు. వేలాది మంది రైతులు సుబాబుల్ పంట పండిస్తున్నారని, గతంలో టన్నుకు రూ.4,500 ఇచ్చారని, ఇప్పడు కేవలం రూ.1,500 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డులు జారీ చేయాలన్నారు. విదేశాల్లో ఉన్న భూ యజమానులు వీడియో కాల్ ద్వారా అంగీకరించినా కార్డులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ అవనిగడ్డలో ప్రభుత్వ కళాశాలకు ఎకరం స్థలాన్ని గతంలో గాంధీ క్షేత్రం పేరుతో లీజుకు తీసుకుని కొంత కాలం కార్యక్రమాలు చేశారని, కానీ అదే స్థలంలో షాపులు కట్టి అద్దెకు ఇచ్చారని, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ జరగడం లేదన్నారు. లీజ్ రద్దు చేసి కళాశాలకు లేదా ప్రజోపయోగానికి వినియోగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సిఇఓ జి.శ్రీనివాసరావు, జడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, ఉమ్మడి కష్ణా పరిధిలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ జమల పూర్ణమ్మ, కష్ణా డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, కష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










