వాల్మీకిపురం : ఏలాంటి అనుమతులు లేకపోయినా రాజకీయాన్ని పలుకుబడిని ఉపయోగించి తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని ఇష్టానుసారంగా రోడ్డుకు ఆనుకొని ప్రయివేటు పాఠశాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ మార్గమైనా అంతా సక్రమంగా చేసేస్తా మన్నట్లు వాల్మీకిపురం పట్టణంలో ఓ ప్రయివేట్ పాఠశాల భవనాలు వెలిశాయి. వివరాలలోకి వెళితే... గుర్రంకొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి వాల్మీకిపురం బైపాస్ రోడ్డులో ప్రయివేటు పాఠశాల భవనాలు నిర్మించి ఎంచక్కా ప్రారంభించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల భవనాలు ఎక్కడో లేదు.. సరిగ్గా మండల విద్యాశాఖ కార్యాలయం ఎదురుగానే నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. పాఠశాల ఏర్పాటుకు అనుమతులు కావాలంటే తోలుతగా మండల విద్యాశాఖ అధికారి నుండి తప్పనిసరి అనుమతులు ఉండాలి. అనుమతుల తరువాత పాఠశాల భవనాల నిర్మాణం, సౌకర్యాలు అన్నీ కూడా అధికారుల ఆదేశాల మేరకు ఉండేలా చూడాలి. స్థానిక మండల విద్యాశాఖ అధికారుల అనుమతులు కాదు కదా కనీసం కార్యాలయంలో కూడా అధికారులను సంప్ర దించకపోవడం విడ్డూరం. గత కొద్ది నెలలుగా నిర్మాణాలు జరుగుతుంటే ఏదో అనుకున్న అధికారులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితం స్కూల్ పేరిట భవనాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయ్యడం, గురువారం రోజున పాఠశాల ప్రారంభం కూడా పూర్తి చేసి పట్టణంలో ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. కాగా నిర్మాణాలు చేపట్టిన స్థలాలు కూడా నగారా ఎద్దుఇనాం పేరిట కోర్టులో ఉండటం, నిర్మాణం ప్రారంభంలో సమీప గొల్లపల్లె గ్రామస్తులు అడ్డుపడి గొడవపడినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామ పంచాయతీ నుండి అనుమతులు, తాగునీటి కుళాయి, కరెంట్ మీటర్ తదితరం అన్నీ వచ్చిన తరువాత నిర్మాణాలు పూర్తి చేసి చివరలో పాఠశాల బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకవేళ విద్యాశాఖ అనుమతులు పొందితే సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉండేలా చూసుకుంటారు. ఇక్కడ మాత్రం సరిగ్గా రోడ్డుకు అర అడుగు దూరంలో పాఠశాల భవనాలు అదికూడా సిమెంట్ ఇటుకలు, రేకులతో తరగతి గదులను నిర్మించారు. పాఠశాల యజమాన్యానికి చెందిన వ్యక్తి తాను ఓ పత్రికా విలేకరినని, అంతే కాక అధికార పార్టీ అండ కూడా ఉందని బెదిరింపులకు కూడా పాల్పడినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నిత్యం అటుగా వెళ్లే విద్యాశాఖ అధికారులు గానీ, మరే ఇతర అధికారులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. సరిగ్గా రోడ్డుపై నిర్మించిన పాఠశాల భవనాలు ఒకవేళ అనుమతులు ఉన్నా విద్యార్థులకు ప్రమాదకరమే అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పాఠశాల నిర్మాణాలపై దృష్టి సారించి, చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అనుమతులు ఇవ్వలేదు
విద్యాశాఖ నుండి పాఠశాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి కూడా పాఠశాలకు అనుమతులు ఇచ్చినట్లు తమకు సమాచారం అందలేదు. అక్రమంగా నిర్మాణాలు, పాఠశాల నిర్వహణ జరిపితే విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిక అందిస్తాం.
- వెంకటరత్నం, ఎంఇఒ, వాల్మీకిపురం.
మాన్యంను ఆక్రమించుకున్నారు
శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానమునకు చెందిన నగారా ఎద్దు ఇనాం మాన్యంను అక్రమార్కులు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేశారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నా రాజకీయ ప్రోద్భలంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి అనుమతులు లేకుండా పాఠశాల ఏర్పాటు చేశారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టి అక్రమ కట్టడాలను తొలగించి, నగారా ఎద్దు ఇనాం మాన్యంను స్వాధీన పరుచుకోవాలి.
- నల్లకాసుల రామకృష్ణ, గొళ్లపల్లి, వాల్మీకిపురం.
పాఠశాలను సీజ్ చేయాలి
పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇనాం భూముల్లో దురాక్రమణకు పాల్పడి యథేచ్ఛగా ప్రయివేటు పాఠశాలను ఏర్పాటు చేయడం అధికారులకు తెలియకుండా నిర్మాణం చేయడం సాధ్యం కాదు. విద్యా, రెవెన్యూ అధికారులు ఆక్రమణ దారులతో కుమ్మక్కైనందు వలనే పాఠశాల నిర్మాణం జరిగినా చోద్యం చూస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని, అక్రమంగా నడుపుతున్న పాఠశాలను సీజ్ చేయాలి. దురాక్రమణకు పాల్పడినందుకు గానూ కేసులు కూడా నమోదు చేయాలి. లేనిపక్షంలో ప్రత్యేక్ష ఆందోళనకు దిగుతాం.
- శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి, అన్నమయ్య.










