- సిపిఎంను అక్కున చేర్చుకున్న మలయాళీలు
- కుటుంబ సమేతంగా మహాసభల వద్దకు
- వేలాదిగా తరలస్తున్న ప్రజానీకం
- నాయకుల వీక్షణకు, కరచాలనాలకు ఆసక్తి
- నాలుగో రోజుకు మహాసభ
- నేడు ముగింపు, బహిరంగ సభ
- రెండు వేల మంది రెడ్‌షర్టు వాలంటీర్ల కవాతు
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో తిరునాళ్లు, పండగలు, వేడుకలు, పెళ్లిళ్లకు కుటుంబాలకు కుటుంబాలు తరలిరావటం ఆనవాయితీ. ఆ ఫంక్షన్లు జరిగినన్ని రోజులూ ఎలాంటి అవరోధాలు, ఆటంకాలూ ఎదురు కాకూడదని ఆకాంక్షిస్తూ అవి విజయవంతం కావాలని కోరుకోవటం మనకు సహజమైన అలవాటు. ఆ కార్యక్రమాలకు వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవటం, జయప్రదమయ్యాక అతిథులకు ఘనమైన వీడ్కోలు పలకటం మనకు రివాజు. ఇప్పుడు అచ్చంగా ఇదే తరహాలో కేరళ ప్రజానీకం... ఇక్కడి కన్నూరులో కొనసాగుతున్న సీపీఎం 23వ అఖిల భారత మహాసభకు తండోపతండాలుగా తరలస్తున్నది. మహాసభ కొనసాగుతున్న ఇకె నయనార్ అకాడమీ వద్దకు నిత్యం వేలాది మంది కుటుంబాల సమేతంగా తరలస్తున్నారు. వారి రాకతో కన్నూరు నగరంలోని రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఎండ వేడిమిని, తీవ్రమైన ఉక్కపోతను సైతం లెక్కచేయక... పసి పిల్లల్ని సైతం చంకనేసుకుని మరీ వారు మహాసభ ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ జనసందోహం ఎంత ఎక్కువగా ఉంటుందంటే- మహసభ ప్రాంగణం వద్దకు ప్రతినిధులు, పాత్రికేయులు వెళ్లాలంటే పక్కనే ఉన్న మెయిన్ రోడ్డు నుంచి కనీసం అరగంట సేపు పడుతుంది. అంతలా జన ప్రవాహం అక్కడకు వచ్చి చేరుతోంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉంచిన అంతర్జాతీయ కమ్యూనిస్టు యోధులు, సీపీఎం జాతీయ, రాష్ట్ర నేతల ఫొటోలు, ఫ్లెక్సీల వద్ద పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి సందడిగా గడుపుతున్నారు.
మరో విశేషమేమంటే... ఎర్ర చీరలు, ఎర్ర చొక్కాలు ధరించి, నెత్తిన కేరళకే ప్రత్యేకమైన టోపీ (హ్యాట్)లతో అక్కడికి వస్తున్న మహిళలు, పురుషులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. చిన్నారులు సైతం చే గువేరా ఫ్లెక్సీల వద్ద పెద్దఎత్తున ఫొటోలు దిగుతూ ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యమైన నాయకులు, కేరళ సీఎం పినరయి విజయన్‌ను చూసేందుకు, వారితో కరచాలనం చేసేందుకు జనాలు పోటీ పడుతున్నారు. ఎంతో బిజీగా ఉన్న ఆయా నాయకులు కూడా వారిని చిరునవ్వుతో పలకరిస్తూ, కరచాలనం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మహాసభ ప్రాంగణం వద్ద, వివిధ వేదికల వద్ద రోజూ కిక్కిరిసిపోతున్న జనాల్నిబట్టి కేరళ ప్రజలు, పార్టీయే కుటుంబం... ఉద్యమాలే ఊపిరిగా బతుకుతూ... కమ్యూనిస్టు పార్టీలకు అండదండలనిస్తూ జేజేలు పలుకుతున్నారనే విషయం విదితమవుతోంది. వారు మలయాళంలో ఇచ్చే నినాదాల సారం మనకు అర్థం కాకపోయినా ఆ స్ఫూర్తి మాత్రం వారి గొంతులో ప్రతిఫలిస్తోంది.
- నేడు సభల ముగింపు, బహిరంగ సభ
గత నాలుగు రోజులుగా దిగ్విజయంగా సాగుతున్న సిపిఎం 23వ అఖిల భారత మహాసభ ఆదివారం ముగియనుంది. ముగింపు సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఇకె నయనార్ అకాడమీ నుంచి ఎర్రదండు కవాతు బయల్దేరుతుంది. రెండు వేల మందితో కూడిన రెడ్ షర్టు వాలంటీర్లు (వెయ్యి మంది పురుషులు, వెయ్యి మంది మహిళలు) ఈ ప్రదర్శనలో కదం తొక్కనున్నారు. మహాసభలో పాల్గన్న ప్రతినిధులు, కేంద్ర కమిటీ సభ్యులు వారిని అనుసరిస్తారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభా స్థలైన ఏకే గోపాలన్ ప్రాంగణానికి (జవహర్ స్టేడియం) ప్రదర్శన చేరుకుంటుంది. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్, బృందా కరత్, మాణిక్ సర్కార్, పినరయి విజయన్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, కొడియేరి బాలకృష్ణన్, ఎమ్‌ఏ బేబి తదితరులు ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభకు కేరళ నుంచేగాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరానున్నారు.










