ప్రజాశక్తి మడకశిర : గతంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన సేవలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని టిడిపి సత్యసాయి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారథి నాయకులు, కార్యకర్తలను కోరారు. మంగళవారం మడకశిర పట్టణంలోని యాదవ కళ్యాణమండపంలో రియల్ టైం స్ట్రాటజీ శిక్షణ కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బికె పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందామన్నారు. ఈసందర్భంగా ఆయన గ్రామ, పట్టణాల రూపురేఖలు మార్చారని చెప్పారు. అయితే ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి ఎక్కడా కన్పించడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తే కక్ష సాధింపులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఈనేపథ్యంలో టిడిపి ఆధ్వర్యంలో చేపడుతున్న ఆర్‌టిఎస్ పార్టీ శ్రేణులను అన్ని రంగాల్లో చైతన్యపరిచి కార్యోన్ముఖులను చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, జిల్లా మైనారిటీ నాయకులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు, పట్టణ అధ్యక్షులు తదితరులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










