Mar 29,2023 22:55

లోకేష్‌ను అభినందిస్తున్న జెసీ ప్రభాకర్‌రెడ్డి

పెనుకొండ : తెలుగుదేశం పార్టీ నాయకులు జెసి ప్రభాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెనుకొండ మండలంలో జరుగుతున్న నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా లోకేష్‌ను శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా మీడియాతో జెసి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారని అయితే సరైన లీడర్లు ఎవరు లేరని అన్నారు. మూడున్నర సంవత్సరాలు కార్యకర్తలు కష్టపడ్డారని ఆ సమయంలో లీడర్లు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎవరు బయటకి రాలేదో వాళ్లకు టికెట్‌ ఇవ్వొద్దని లోకేష్‌ చెపుతున్నట్లు తెలిపారు. తనకు 72 సంవత్సరాలని, తనకు టికెట్‌ వద్దని అన్నారు. తాను పార్టీకోసం కష్టపడుతానన్నారు. తనలాంటి వారందరూ టికెట్‌ ఆశించకూడదన్నారు. అందరికీ తోక కట్‌ చేసి పారేయమని చంద్రబాబుకు చెబుతున్నానన్నారు. ధైర్యంగా ఉన్నవారి కి టికెట్‌ ఇవ్వాలని కోరారు. కేసులకు ఎవరూ భయపడద్దని తనపై 72 కేసులు అయ్యాయని అవి ఏమవుతాయని జెసి ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.