పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం..
ప్రజాశక్తి-ఉదయగిరి : నియోజకవర్గంలో టిడిపి బలోపేతానికి ప్రతి ఒక్కరినీ కలుపుకొని పూర్తి స్థాయిలో కృషి చేస్తామని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ జెడ్‌పి చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 8మండలాల పరిధిలో ఉన్న నాయకులను కొత్త, పాత అని తారతమ్యం లేకుండా అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీలోకి కొత్త వారిని చేర్చుకున్న వారికి తగిన ప్రాధాన్యత గుర్తింపు ఉంటుందన్నారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొని గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఉదయగిరిలో వైసిపి పరిస్థితి ఎంఎల్‌ఎ లేక, ఇన్‌ఛార్జి లేక లంగరు లేని నౌకగా ప్రయాణం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేసుకుందామా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి సి.రమణయ్య, సుమన్, మస్తాన్ పాల్గొన్నారు.










