Jan 19,2023 22:29

సమావేశంలో పాల్గొన్న నాయకులు

హిందూపురం : :నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మూడు గ్రుపులుగా నాయకులు, ప్రజాప్రతినిధులు విడిపోయారని, అందరిని ఏకతాటిపై తీసుకువచ్చి సమన్వయంతో ముందుకు పోతామని పార్టీ అబ్జర్వర్‌ రెడ్డిశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌ అండ్‌ బి అథితి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో వైసీపీలో మూడు గ్రూపులుగా ఏర్పడి పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆలోచనతో సీఎం జగన్‌ తనను హిందూపురం అబ్జర్వర్‌ గా పంపారన్నారు. ఆయన ఆదేశాల మేరకు హిందూపురంలో వైసీపీని ఒక గాడిలో పెడతానన్నారు. వచ్చే మార్చి నెలలోపు గ్రూపులన్నిటికీ చెక్‌ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వర్గాలుగా విడిపోయి పార్టీకి నష్టం కలిగిస్తే అటువంటి నాయకులపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇప్పటికే నియెజక వర్గ వ్యాప్తంగా ఉన్నా అసమ్మతి నాయకులు, అసమ్మతి ప్రజా ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి, వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు. అందరం కలిసి పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపడుతామన్నారు. త్వరలో ఇన్‌చార్జ్‌ మంత్రి వస్తారని అన్ని విషయాలు ఆయనకు వివరించి పార్టీని పటిష్టం చేస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ బలరామిరెడ్డి, కౌన్సిలర్‌ శివ, నాయకులు జనర్దాన్‌ రెడ్డి, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.