Dec 23,2021 07:03

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మళ్లీ మళ్లీ వెల్లడైంది. విభజనతో అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రజానీకం ముక్తకంఠంతో ఘోషిస్తుంటే బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించింది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలినాళ్లలోనే విశాఖ రైల్వే జోన్‌ ఇచ్చే ప్రతిపాదన లేదని చెప్పిన మోడీ ప్రభుత్వం ముగింపునకు ఒక రోజు ముందు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించింది. మన హక్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కును తెగనమ్మి తీరుతామని, అది సాధ్యం కాకపోతే మూసివేస్తామని సమావేశాల మధ్యలోనే చెప్పేశారు. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ చేతులెత్తేసింది. మొత్తం మీద శీతాకాల సమావేశాల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సున్నా చుట్టేసింది. సమైక్య రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల నుండి వెనక్కి తగ్గింది. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరి, లెక్కలేనితనం ఇంత స్పష్టంగా బట్టబయలైన తరువాత కూడా మన రాష్ట్ర ఎం.పి లు చేష్టలుడిగినట్టు చూస్తూ ఉండటం, కనీస నిరసన కూడా తెలపలేకపోవడం సిగ్గుచేటు. ఎం.పి ల ఈ వైఖరి రాష్ట్ర ప్రజలను, వారి పోరాట స్ఫూర్తిని అవమానించడమే!
విశాఖ రైల్వేజోన్‌తో పాటు, పోలవరం ప్రాజెక్టు గురించి పేర్కొన్న రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటే ఆమోదించింది. ఇప్పుడు అదే పార్లమెంటులో మోడీ సర్కారు ససేమిరా అంటోంది. ప్రత్యేక హోదా ఇస్తామంటూ అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని సైతం అమలు చేయడానికి నిరాకరిస్తోంది. పైగా హామీకి బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించిందని, ఆ మేరకు ప్యాకేజి ఇచ్చినందువల్ల హోదా ఇవ్వలేమని తాజాగా ప్రకటించింది. దీనిపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుగానీ, ఆ పార్టీ ఎంపీలుగానీ పెదవి విప్పడం లేదు. ప్యాకేజిని తొలుత స్వాగతించి, ప్రజానీకం నుండి వచ్చిన ఒత్తిడితో మరో మార్గం లేక ఎన్నికలకు ముందు హోదాకు అనుకూలంగా మాట్లాడిన టిడిపి, ఇప్పుడు దానిని సాధించాల్సిన బాధ్యత వైసిపిదే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నీతి అయోగ్‌ సిఫార్సుల కారణంగా రాష్ట్రానికి హోదా ఇవ్వలేకపోతున్నామంటూ అప్పట్లో కేంద్రం పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అదే నీతి ఆయోగ్‌ బీహార్‌కు హోదా ఇచ్చే విషయం పరిశీలనలో ఉందంటూ చేసిన ప్రకటనపై కూడా వైసిపి, టిడిపి పెదవి విప్పకపోవడం దారుణం! ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక కాడి కిందపడేశారు. బిజెపి కి పూర్తి బలం ఉన్నందువల్ల ఏమీ చేయలేమని ప్రకటించారు. ప్యాకేజిని పాచిపోయిన లడ్డూతో పోల్చిన జనసేనాని ఇప్పుడు బిజెపి భజనలో మునిగితేలుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలోనూ రాష్ట్ర ప్రజానీకం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుంటే మీనమేషాలు లెక్కిస్తూ రాష్ట్రానికి హాని చేసే ఇటువంటి ధోరణినే ఈ మూడు పార్టీలు అనుసరిస్తున్నాయి. విశాఖ ఉక్కును ముక్కలు ముక్కలు చేసి తెగనమ్మడానికి కేంద్రం శరవేగంతో ముందుకుపోతున్నా వీరు పట్టీ పట్టన్నట్లు వ్యవహరిస్తుండటమే దీనికి నిదర్శనం.
హోదా లేకుండా, రైల్వేజోన్‌ రాకుండా, ప్రభుత్వ రంగంలో ఉన్న ఒకే ఒక్క ఉక్కుఫ్యాక్టరీనీ తెగనమ్మిన తరువాత రాష్ట్రాభివృద్ధి ఎలా జరుగుతుంది? వీటిని సాధించుకోకుండా, ఉన్నవాటిని కాపాడుకోకుండా ప్రజల జీవనస్థితి గతులు ఎలా మెరుగుపడతాయి? ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ పార్టీలపై ఉంది. ప్రధానంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో స్పందించాలి. రాష్ట్రానికి పదేపదే ద్రోహం చేస్తూ, ప్రజా ప్రయోజనాలకు హాని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై తమ వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించాలి. సొంత ప్రయోజనాలను పక్కన బెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా గళమిప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించాలి. రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో కేంద్రంతో సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడాలి. ఈ దిశలో రూపొందించే భవిష్యత్‌ కార్యాచరణే రాష్ట్ర ప్రయోజనాలకు దోహదం చేస్తుంది.