May 25,2023 21:21

ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి-నెల్లూరు :కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం సంతపేటలోని పాత మున్సిపల్‌ ఆఫీసు వద్ద 42, 43,47,48,49,50 డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులు నిరసన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లోని కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ప్రజల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మినెంట్‌ చేస్తానని వాగ్దానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకూ నామమాత్రమైన చర్యలు కూడా చేపట్టలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్‌ కార్మికులను తక్షణమే పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి బీపీ నరసింహ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి ఎం అశోక్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు లోకేష్‌, శ్రీనివాసులు,చంద్రమ్మ, యోహాన్‌, పవన్‌ ఉన్నారు.