Sep 26,2023 20:56

మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దష్టి
ప్రజాశక్తి-నెల్లూరు:వర్షాకాలపు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నగర వ్యాప్తంగా డ్రైను కాలువల్లో పూడికతీత పనులు, మురుగు పారుదలకు చర్యలు, దోమల వ్యాప్తి నిర్మూలన వంటి వివిధ అంశాలపై ప్రత్యేక దష్టి సారించి, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కారించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్టోన్‌ హౌస్‌ పేట, రేబాలా వారి వీధి, ఏ. సి. నగర్‌, రామ్మూర్తి నగర్‌ తదితర ప్రాంతాలను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్‌ పర్యవేక్షించి అధికారులు, సిబ్బందికి వివిధ సూచనలు జారీ చేశారు.తడి, పొడి చెత్తను వాహనాల ద్వారా ఇళ్ల నుంచి మాత్రమే సేకరించాలని, వీధుల్లో వ్యర్ధాలు వేస్తున్న ప్రాంతాలను గుర్తించి స్థానికులను హెచ్చరించాలని సూచించారు.
వీధుల్లో వ్యర్ధాలు వేయకుండా అవగాహన కల్పించి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలంతా సహకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.డ్రైను కాలువల పూడికతీత సిల్టును ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, దోమల వ్యాప్తి లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. స్థానికంగా ఉన్న దుకాణాల నిర్వహకులతో మాట్లాడుతూ వ్యర్ధాలను డ్రైను కాలువల్లో వేయరాదని, ప్రతీ దుకాణం బయట తడి, పొడి చెత్త సేకరణకు విధిగా డస్ట్‌ బిన్‌ లను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. డస్ట్‌ బిన్‌ లను ప్రజలకు కనిపించేలా షాపుల ప్రాంగణాల్లో ఉంచి, ఖాతాదారులు తప్పనిసరిగా వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. షాపుల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే షాపు నిర్వహకునికి జరిమానా విధిస్తామని కమిషనర్‌ హెచ్చరించారు.భవన నిర్మాణ మెటీరియల్‌ వీధుల్లో నిల్వ చేయకుండా పర్యవేక్షించాలని, రోడ్లను ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి అపరాధ రుసుము వసూలు చేయాలని సచివాలయ కార్యదర్శులను కమిషనర్‌ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకట రమణ, శానిటరీ సూపర్వైజర్‌ లు, సచివాలయం కార్యదర్శులు పాల్గొన్నారు.