Feb 14,2022 07:59
  • మైనస్‌ 9.30కు తగ్గుదల
  • కీలక పరిశ్రమలలో పడిపోయిన ఉత్పాదకత
  • తాజా నివేదికను విడుదల చేసిన ఆర్థిక, గణాంకశాఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తులు పతనావస్థ కొనసాగుతోంది. మైనింగ్‌, క్వారీయింగ్‌తోపాటు తయారీ, విద్యుత్‌ రంగాలలోనూ ఉత్పాదకత గణనీయంగా తగ్గిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) వృద్ధి రేటు 2020-21 ఆర్థిక సంవత్సరం నవంబర్‌లో మైనస్‌ 3.90 శాతంగా ఉంటే, 2021-22 నవంబర్‌కు మైనస్‌ 9.30కు పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రకారం..కీలక రంగాలలో ఉత్పాదక సామర్థ్యం పడిపోవడంతో సాధారణ సూచిక కూడా పతనావస్థకు చేరింది. అలాగే గతేడాది నవంబర్‌ ఐఐపితో పోల్చితే తయారీ రంగంలో మైనస్‌ 8.10 శాతం, మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌లో మైనస్‌ 24.10 శాతం, ఎలక్ట్రిసిటీలో మైనస్‌ 6.02 శాతానికి వృద్ధి క్షీణించింది.
    2011-12 బేస్‌ సంవత్సరంతో ఈ ఏడాది పారిశ్రామిక ఉత్పత్తి సూచికను పోల్చినపుడు ఐఐపి తిరోగమనంలో పయనిస్తోంది. గనులు, భూగర్భశాఖ, ఎపి ట్రాన్స్‌కో, ఎంపిక చేసిన 353 ఫ్యాక్టరీల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఆర్థిక, గణాంకశాఖ నవంబర్‌ ఐఐపిని విడుదల చేసింది. తయారీ రంగంలో కీలకమైన 23 పరిశ్రమలలో మూడింటిలో ఉత్పాదకత భారీగా పడిపోయింది. బేసిక్‌ మెటల్‌ తయారీ సూచిక గతేడాది నవంబర్‌లో 123.51 ఉండగా, ఈ సంవత్సరం నవంబర్‌ నాటికి అది 122.97కు తగ్గింది. దీంతో వృద్ధి రేటు 0.44 శాతం పడిపోయింది. ఇతర నాన్‌ మెటలిక్‌ మినరల్‌ ఉత్పత్తులు 100.36 నుంచి 85.19కి తగ్గడంతో వృద్ధి రేటు 15.12 శాతం, ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్‌లో 19.98 శాతం తగ్గుదల కనిపించింది. బేవరేజీస్‌, వేరింగ్‌ అప్పరల్‌, రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తులు, రబ్బర్‌, ప్లాస్టిక్‌ ఉత్పాదకత, యంత్రాల తయారీలోనూ నెగిటివ్‌ వృద్ధిరేటు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. తయారీ, ఎలక్ట్రికల్‌, మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌లో ఐఐపి వృద్ధి రేటు గణనీయంగా పడిపోయినట్లు తెలిపింది.