Aug 11,2022 22:58

రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారులకు చోటులేదు
 జిల్లా రిజిస్ట్రార్‌ విఎస్‌
ఆర్‌ ప్రసాద్‌
ప్రజాశక్తి కంచికచర్ల
రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ లు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ వి యస్‌ ఆర్‌ ప్రసాద్‌ అన్నారు. కంచికచర్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గురువారం ఆయన తనిఖీలు చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో లావాదేవీలు పారదర్శక జరిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా డాక్యుమెంట్‌ రైటర్లు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోకి అనుమతులు లేవన్నారు. స్తిర,చరాస్థులు, ఇతర రిజిస్ట్రేషన్‌ లు కోసం నేరుగా సంబంధిత కస్టమర్లు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లావాదేవీలు పూర్తిచేసు కోవచ్చన్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల ను ఆశ్రయించి కమీషన్ల పేరుతో నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో అమ్మకం, కొనుగోలు దారుల నుండి కమిషన్ల పేరుతో డబ్బు డిమాండ్‌ చేస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. కస్టమర్ల నుండి అక్రమ వసూళ్ళ కు పాల్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్న్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల దందాకు తావులేదన్నారు. అమ్మకం, కొనుగోలు దారులే సంబంధిత డాక్యుమెంట్‌ లతో నేరుగా కార్యాలయానికి వచ్చి లావాదేవీలు చేసుకునే విధంగా, కార్యాలయాల్లో అవగాహన కోసం బోర్డలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అక్రమాలు జరిగితే టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌ కె నరశింహారావు తదితరులు పాల్గొన్నారు.