ప్రజాశక్తి-విజయవాడ: జిల్లాలో పారదర్శకంగా సకాలంలో నాణ్యమైన రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేయడం వల్ల సులువుగా సేవలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నగరంలోని పకీరుగూడెం 242 రేషన్ దుకాణం, కెఆర్ 84062 నెంబర్ గల మొబైల్ వాహనం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ విధానాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5,86,645 రేషన్ కార్డులు ఉన్నాయని, కార్డుదారులకు 958 రేషన్ దుకాణాలు, 374 మొబైల్ వాహనాలు ద్వారా 8,375 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన రేషన్ బియ్యాన్ని ప్రతి నెల మొదటి వారంలో కార్డుదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. మొబైల్ వాహనం ద్వారా సకాలంలో కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తూ కార్డుదారుల ప్రశంసలు అందుకుంటున్న ఎస్.సాయి శివప్రసాద్‌ను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారిణి పి.కోమలిపద్మ, సహాయ పౌరసరఫరాల అధికారి ధనుంజయరెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు కె. కిషోర్, యం భగీనాద్, ఏ సరత్‌బాబు, జి ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.










