May 08,2023 21:45

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి కేతా వేణుగోపాల్‌రెడ్డి, జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలక్ష్మి

పారదర్శకంగా పనులు చేశాం : వైసిపి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు పారదర్శకంగా చేశామని, గ్రామంలో రైతులందరినీ అధికారులు విచారించే ఈ నివేదికలు తయారు చేశారని వైసిపి నాయకులు పేర్కొన్నారు. సోమవారం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆదేశాలతో ఆత్మకూరులోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, ఇతర నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి కేతా వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ చండ్రా మల్లికార్జున అనే వ్యక్తి వైసిపిలో చేరినప్పటికీ కొంతకాలం వరకు ఉన్నారని, అనంతరం టిడిపి నాయకుల ప్రచార కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారని, ఆయన వైసిపికి చెందిన వ్యక్త కాదన్నారు.
2020-21లో అప్పారావుపాళెంలో టెండర్‌ వర్కులు జరిగాయని, 2021లో వరదలు రావడంతో పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయని, ఆ సంవత్సరం మళ్లీ పంటలు వేసే అవకాశం కూడా లభించలేదన్నారు. అప్పట్లో మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎఫ్‌డిఆర్‌ కింద నిధులు మంజూరు చేశారని, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఈ పనులు చేశామన్నారు. ఈ పనుల్లో ఎలాంటి అవకతకవలు లేవని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు స్పందనలో అర్జీలు ఇవ్వడంతో అధికారులు తనిఖీలు వచ్చి రైతులతో మాట్లాడారని, ఎలాంటి అవకతవకలు జరగలేదని రైతులు వారికి తెలిపారన్నారు. జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ గతంలో అప్పారావుపాళెంలో కూర్చునేందుకు కూడా ఎలాంటి ఏర్పాటు ఉండేది కాదని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణాలు చేపట్టామని, ఇప్పటికే సచివాలయ భవనం నిర్మాణం పూర్తయిందని వివరించారు. గ్రామాలను అభివృద్ధి చేసే పనిలో మేమంతా ఉంటే లేనిపోనివి సృష్టించి స్పందనలో అర్జీలు ఇచ్చి ఆ కార్యక్రమ ఉద్దేశ్యాన్నే మార్చి వేస్తున్నారని, ఇది సరైన పని కాదని తెలిపారు. అధికారులు రైతులందరిని విచారించారని, అనంతరం జిల్లా అధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో బోయలచిరువెళ్ల సర్పంచ్‌ బొలిగర్ల వెంకటేశ్వర్లు, నాయకులు బొమ్మిరెడ్డి రవికుమార్‌ రెడ్డి, తోడేటి అశోక్‌, మంజాన్‌ బాషా తదితరులున్నారు.