రాయచోటి : పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ గిరీష సెక్ట్రోరల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎటువంటి చిన్న సమస్య తలెత్తకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికలలో రీపోలింగ్‌కి అవకాశం లేకుండా జాగ్రత్తగా పోలింగ్ సరళి జరిగేటట్టు చూడాలన్నారు. సెక్టోరల్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. సెక్టోరియల్ అధికారులకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపు, వీల్ చైర్స్, విద్యుత్, తాగునీరు, వెబ్ క్యాసిటింగ్ చేయుటకు అవసరమైన విద్యుత్ సౌకర్యాలు ఉండేటట్లు చూడాలన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు వరకు మార్కింగ్ చేయాలని,పోలింగ్ కేంద్రం లోనికి సెల్ ఫోన్స్, టీ, కాఫీ, వాటర్ బాటల్స్, పెన్‌లు, అగ్గి పెట్టలు తీసికెళ్లారాదన్నారు. పిఒ ఇచ్చిన పెన్‌తోనే ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్స్ ఓటరుకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలని, ఓటర్ ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను బ్యాలెట్ బాక్స్‌లో వెచేలా సెక్టోరియల్ అధికారులు పరిశీలించాలన్నారు. పొలింగ్ కేంద్రాలలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహింస్తామని తెలిపారు. ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం వివరాలను ఉన్నతాధికారులకు పంపాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో సమన్వయం చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 13న సాయంత్రం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పిఒ, డైరీ, బ్యాలెట్ పేపర్స్ అకౌంట్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించి మీకు కేటాయించిన రిసెప్షన్ కేంద్రంలో అందజేయాలని సెక్టోరియాల్ అధికారులను ఆదేశించారు. పిఒలు, ఎపిఒలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను సెక్టోరియల్ అధికారుల వద్ద ఉంచుకోవాలన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని తెలిపారు. ఎన్నికలలో ఓటు వేసే ఓటర్లు ఓటర్ స్లిప్‌తో పాటు ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డు తప్పకుండా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్లో ఎటువంటి సమస్య వచ్చినా సెక్టోరల్ అధికారులకు, తహశీల్దార్లకు ఫోన్ చేయడం జరుగుతుందని వీరు లా అండ్ ఆర్డర్ పక్కాగా పాటించాలన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినట్లయితే ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్‌లు జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ అకౌంట్ ప్రతి ఏజెంట్ దగ్గర ఉండేటట్లు చూడాలన్నారు. ఎలక్ట్రోరల్ అధికారులు ఈ ఎన్నికలలో ఓవరాల్ గా ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు ఆ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సీరియల్ నెంబర్ల వారీగా ఓటర్ల వివరాలు బయట అతికించాలన్నారు.ఈ ఎన్నికలను ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకొని రీ పోలింగ్‌కు అవకాశం లేకుండా పోలింగ్ సరళి విజయవంతం చేసి అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రాయచోటి ఆర్డీవో రంగస్వామి, సెక్ట్రోరల్ అధికారులు పాల్గొన్నారు.










