Apr 08,2022 21:56

పాలస్తీనాకు, పాలస్తీనా ప్రజలకు సిపిఎం 23వ అఖిల భారత మహాసభ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మరో కేంద్ర కమిటీ సభ్యులు ఎలమరం కరీం బలపరిచారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాలస్తీనా ప్రజలు భాగంగా ఉన్నారని తీర్మానంలో తెలిపారు. పాలస్తీనా ప్రజలను అణచివేతకు గురిచేస్తున్న ఇజ్రాయిల్‌ను బహిష్కరించడంతో పాటు అన్ని రకాల బిడిఎస్‌ చర్యలను అమలు చేయాలని కోరారు. ఇజ్రాయిల్‌తో సైనిక, రక్షణ ఒప్పందాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. 1967 నాటి సరిహద్దుల ప్రకారం తూర్పు జెరూసలెంను రాజధానిగా పాలస్తీనా దేశాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 2018 మార్చి 30 నుంచి పాలస్తీనా ప్రజలు తమ మాతృభూమి కోసం ఆందోళనలు ప్రారంభించారని, రెండేళ్ల తరువాత 2020లో కరోనా కారణంగా వాయిదా వేశారని తీర్మానంలో తెలిపారు. ఇజ్రాయిల్‌ ప్రభుత్వం 260 మందికి పైగా పాలస్తీనియన్లను హత్య చేసిందని, ఆ హింసాకాండలో వేలాదిమంది గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. జెరూసలెంను ఇజ్రాయిల్‌ రాజధానిగా అమెరికా గుర్తించిన తరువాత ఈ హింసాకాండ మరింత పెరిగిందని వివరించారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం తీరువాత జ్యూవిష్‌ జాతీయ రాజ్యంగా పేర్కొంటూ ఇజ్రాయిల్‌ ప్రభుత్వం చట్టం చేసిందని, ఫలితంగా 21 శాతంగా ఉన్న పాలస్తీనియన్లు అన్ని హక్కులూ కోల్పోయారని తెలిపింది. 'కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పాలస్తీనాకు వ్యతిరేకంగా మారింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇది ఆందోళనకరం' అని తీర్మానంలో పేర్కొన్నారు.