Jul 09,2021 22:06

* ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌జిటి ఆదేశం
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల్లో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) చెన్నై ధర్మాసనం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ పథకంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముదిరెడ్డిపల్లికి చెందిన వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జిటిలో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసును విచారణకు తీసుకుంది. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్‌ఇ, మహబూబ్‌నగర్‌ జిల్లా గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది.