Jul 07,2022 22:52

  • కృష్ణామిల్క్‌ యూనియన్‌ అధ్యక్షులు ఆంజనేయులు

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జిఎస్‌టి సమావేశంలో పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి ఉత్పత్తులపై జిఎస్‌టి ఐదు శాతం విధించాలని ప్రతిపాదించారని, దీని వల్ల వచ్చే ఇబ్బందులను కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులకు మెయిల్‌ ద్వారా పూర్తిగా వివరించామని కృష్ణా మిల్క్‌ యూనియస్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మిల్క్‌ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ నిత్యావసరాలైన పాలు, పాల ఉత్పత్తులపై జిఎస్‌టి విధిస్తే ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. పెరుగు, మజ్జిగ, లస్సీపై ఐదు శాతం జిఎస్టీ విధించటం వల్ల ఏడాదికి సుమారు రూ.16 కోట్లు ఆర్థిక భారం పడుతుందని వివరించారు. పాల ఉత్పత్తులకు జిఎస్‌టి వేయకూడదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున కూడా కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి తమ సమితి తరుఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వరబాబు, సభ్యులు అర్జా వెంకట నగేష్‌ పాల్గొన్నారు.