సమీక్షా సమావేశంలో కలెక్టర్ గిరీష
ప్రజాశక్తి-రాయచోటి : పాడి రైతులకు విరివిగా రుణాలు ఇప్పించాలనీ, జిల్లాలో అమూల్‌కు పాల సేకరణ 70 శాతం పక్కాగా జరగాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో తహశీల్దారులు, ఎంపిడిఒలు, జగనన్న పాలవెల్లువ ఆర్‌ఐసిలు, మెంటార్స్‌తో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం, అమూల్‌కు పాలసేకరణపై జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 12,871 మంది రిజిస్టర్ అయిన పాడి రైతులు ఉన్నారన్నారు. వీరిలో 70 శాతం పాడి రైతులు జగనన్న పాలవెల్లువ అమూల్ కేంద్రాలకు పాలు పోసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి పాడి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పాల సేకరణ కొరకు అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జగనన్న పాలవెల్లువ ప్రాముఖ్యతను పాడి రైతులకు తెలియజేసి అమూల్‌కు పాలు పోసే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని ప్రతి పాడి రైతుకు డిసిసి బ్యాంకు ద్వారా రూ.30 నుంచి రూ.50 వేల వరకు రుణం ఇప్పించే ఏర్పాటు చేయాలన్నారు. రూ.30 వేలు రుణం తీసుకుని తిరిగి సక్రమంగా చెల్లించిన వారికి గేదెలు కొనుగోలు చేసుకునేందుకు తక్కువ వడ్డీతో రూ.1.60 లక్షల రుణం ఇస్తామని పాడి రైతుకు తెలియజేయాలన్నారు. పాడి పశువులు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ పాలు ఇచ్చేందుకు నాణ్యమైన దాణా, మినరల్ మిక్సర్, కాల్షియం మొదలైన ఇన్పుట్స్ పాడి రైతులకు ఇస్తామని తెలపాలన్నారు. ప్రస్తుతం అమూల్‌కు పాలు పోసే వారికి లీటర్‌కు రూ.35 నుంచి రూ.40 వరకు డబ్బులు ఇస్తున్నామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి పాల ధర పెంచుతామని పాడి రైతులకు తెలపాలన్నారు. ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జగనన్న పాలవెల్లువ అమూల్ వచ్చిన తర్వాత పాలు పోసే పాడి రైతులకు పాల రేటు పెంచారని తెలిపారు. జిల్లాలోని పాడి రైతులందరూ అమూల్‌కు పాలు పోసి ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అమూల్‌కు పాల సేకరణ విరివిగా జరిగేందుకు తహశీల్దారులు, ఎంపిడిఒలు, స్థానిక పశువైద్యాధికారి సమన్వయంతో అమూల్‌కు పాలు పోయడం వల్ల పొందే లబ్ధి వివరాలు పాడి రైతులకు కూలం కుశంగా వివరించాలన్నారు. ప్రభుత్వం పశువులకు ఇచ్చే నాణ్యమైన దాణా, పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి పశు వైద్యాధికారులు పలు సూచనలు ఇస్తామని వారికి తెలియజేయాలన్నారు. ప్రతి పాల సేకరణ కేంద్రంలో ఒక నోడల్ అధికారిని నియమించి గ్రామ వాలంటీర్ సహకారంతో ఎక్కువ మంది పాడి రైతులు అమూల్‌కు పాలు పోసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి సంబంధించి అమూల్‌కు పాల సేకరణను సంబంధిత అధికారులు సీరియస్‌గా తీసుకొని జిల్లాలో70 శాతం పైచిలుకు పాల సేకరణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్‌పిళ్లై, కడప జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఒ రమణారెడ్డి, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










